iDreamPost
android-app
ios-app

పుంగనూరు వివాదంలో బట్టబయలైన తెలుగుదేశం బండారం

పుంగనూరు వివాదంలో బట్టబయలైన తెలుగుదేశం బండారం

మంత్రి పెద్దరెడ్డి ఇలాఖ పుంగనూరు లో వైసిపి నేతలు పట్టపగలే నామినేషన్ దాఖలు చెయ్యడానికి వచ్చిన మహిళపై దాడి చేసి ఆమె జాకెట్ లో దాచుకున్న నామినేషన్ పత్రాలను లాక్కున్నారని ప్రచారానికి తెరలేపిన తెలుగుదేశం పార్టీ అసలు బండారం సాక్షాధారాలతో సహా బయటపడింది. నిన్న తెలుగుదేశానికి చెందిన సామాజిక మాధ్యమాలలో, ఒక వర్గం మీడియా లో పెద్దఎత్తునప్రసారమైన ఈ వీడియో వెనుక అసలు జరిగిన విషయాన్ని పక్కనపెట్టి గతరాత్రి నుండి తెలుగుదేశం అవాస్తవాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది.

ఇది నిజమా కాదా అని పూర్తిగా విచారించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ వీడియోను పట్టుకుని మహిళ మీద దాడి చేసిన వైసిపి గుండాలని చూస్తుంటే తన రక్తం మరిగిపోతుందని… తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఇంతకముందెప్పుడు చూడలేదని.. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, జగన్, పెద్దరెడ్డి పై వాడు.. వీడు.. అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయారు. ఆయన అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి మీద దిశా చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని వీరావేశంతో ఘింకరించాడు.

కాగా, ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు మీడియా లో చెప్తున్నట్టుగా వైసిపి నాయకులు సదరు మహిళా మీద దాడి చేసి ఆమె దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కున్నట్టు జరుగుతున్న ప్రచారం అంతా పూర్తి అబద్దమని తేల్చారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా మీడియాకి వెల్లడించడంతో ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మాట్లాడిన డీజీపీ పుంగనూరులో విజయలక్షి అనే మహిళ వర్డ్ మెంబర్ గా నామినేషన్ వెయ్యడానికి వెళ్తుండగా వైసిపి వాళ్ళు అడ్డగించడంతో ఆమె కిరోసిన్ పోసుకొనే ప్రయత్నం చేసినట్టు సమాచారం అందిన వెంటనే చిత్తూరు ఎస్పీ స్వయంగా విచారం జరిపి ఆ ఘటనలో ఎవరెవరు ఉన్నారని ఆ సంఘటన తాలూకు వీడియో ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిపారు.

వీడియోలో విజయలక్ష్మి అనే ఆమె పై దాడిచేసిన వ్యక్తులను గుర్తించామని వారందరూ తెలుగుదేశం వారేనని డీజీపీ ఆధారాలతో సహా బయటపెట్టారు. విజయలక్ష్మి పై దాడిచేసిన వారిలో ఆమె భర్త రామయ్యతో పాటు మరో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి హసీనా, మరో టిడిపి నేత ఇర్ఫాన్ లుగా గుర్తించినట్టు తెలిపారు. ఘటన అనంతరం విజయలక్ష్మిని పొలిసు జీపు లోనే ఇంటికి తరలించినట్టుగా డిజిపి తెలిపారు.

అయితే గత రాత్రి నుండి ఓ వర్గం మీడియాలో మాత్రం ఇది వైసిపి నేతలు దాడేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరు మేధావులు కూడా వాస్తవాలను విచారించుకోకుండా ఈ ఘటనని ఖండిస్తూ “దున్నపోతు ఈనిందంటే దూడని తీసుకెళ్లి గాటిలో కట్టేయమన్న చందాన” మహిళా పై దాడి ఘటనకు మంత్రి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డిదే పూర్తి బాధ్యత అంటూ మీడియా స్టూడియోలలో తీర్పులు కూడా ఇచ్చేశారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో అసలు వాస్తవాన్ని మరుగున పెట్టి ఆ నెపాన్ని వైసిపి మీద తోసివేద్దామనుకున్న తెలుగుదేశం అసలు బండారం మరోసారి సాక్షాధారాలతో సహా బయటపడింది.