iDreamPost
android-app
ios-app

పార్టీని నడపడంలో జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు..!

పార్టీని నడపడంలో జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు..!

ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చే యాలంటే పరిపాలనా అనుభవం అవసరం లేదని, మంచి మనసు ఉంటే చాలని యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరూపించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో పెట్టేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పిన సీఎం జగన్‌ పని తీరును ప్రధాని మోదీ కూడా మెచ్చుకోవడం విశేషం. వైఎస్‌ జగన్‌ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించాలని కూడా మోదీ సూచించడం జగన్‌ పరిపాలనా తీరు ఎలా ఉందో తెలుపుతోంది.

పరిపాలనలోనే కాదు రాజకీయంగా కూడా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రత్యర్థులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలోనే సీనియర్‌నేతను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా.. పార్టీని నడపడంలో యువకుడైన వైఎస్‌ జగన్‌ను అనుసరిస్తున్నారు. పార్టీ నిర్మాణంలో జగన్‌ విధానాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాటించబోతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చడంపై ఆ పార్టీలో కసరత్తు సాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోపాటు వివిధ విభాగాలు, కింది స్థాయిలోని పార్టీ పదవులను కూడా కొత్త వారితో భర్తీ చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడు చొప్పున నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను నియమించేందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. అంటే ఇకపై 13 జిల్లాల అధ్యక్షుల స్థానంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో ఉండబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించే సమయంలోనే పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులను కూడా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ పరంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను 2017లోనే సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు. ప్రతి పార్లమెంట్‌ను జిల్లాగా మారుస్తామని మెనిఫెస్టోలో పెట్టిన సీఎం జగన్‌.. ఆ మేరకు వెంటనే ఈ నిర్ణయాన్ని తన పార్టీ నుంచి ప్రారంభించారు. అప్పటి వరకూ 13 జిల్లాల అధ్యక్షులు కొనసాగుతుండగా.. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలను 25 జిల్లాలు చేస్తామని హామీ ఇచ్చిన వెంటనే వైసీపీ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల పదవులకు నేతలను నియమించారు. జిల్లాల పెంపు ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. మరో ఏడాదిలోపు ఏపీలో 25 లేదా 26 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఈ లోపే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తన పార్టీలోనూ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించబోతుండడం విశేషం.

2014 ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ను పరిపాలనా అనుభవం లేదు. నేను సీనియర్‌ను.. అంటూ మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ విధానాన్నే రాజకీయంగా కూడా పాటిస్తుండడం గమనార్హం.