iDreamPost
android-app
ios-app

రెచ్చగొట్టేందుకు ఇంతలా దిగజారాలా అశోక్‌బాబు..?

రెచ్చగొట్టేందుకు ఇంతలా దిగజారాలా అశోక్‌బాబు..?

వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసేందుకు, జగన్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు ఏ అవకాశం దొరుకుతుందా..? అని కాచుకు కూర్చున్న టీడీపీ.. పీఆర్‌సీ విషయంలో నిన్నమొన్నటి వరకు నానా యాగీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం పైకి రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఎన్‌జీవో సంఘ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ఉద్యోగులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా మాట్లాడారు. అయితే పీఆర్‌సీని ప్రకటించడంతోపాటు.. ఉద్యోగులు ఊహించని విధంగా రిటైర్‌మెంట్‌ వయస్సు 60 నుంచి 62కు పెంచడం, సొంత ఇంటి కలసాకారం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అప్పటి వరకు టీడీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ నీరుగారిపోయాయి.

అయితే తాజాగా పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఆందోళనను వ్యక్తం చేస్తూ.. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తమ డిమాండ్లను చెబుతున్నారు. ఈ పరిస్థితిని మళ్లీ తమకు అవకాశంగా మలుచుకునేందుకు టీడీపీ సిద్ధమైపోయింది. మళ్లీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు రంగంలోకి దిగారు. మీడియా ముందుకు వచ్చి.. ఉద్యోగ సంఘాల నేతలను మునుపటికన్నా ఎక్కువగా రెచ్చగొట్టేందుకు యత్నించారు. ఉద్యోగ సంఘాల నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలను హిజ్రాలతో పోల్చారు. పీఆర్‌సీ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు వాట్స్‌ అప్‌ ఉద్యమం చేస్తున్నారని అశోక్‌బాబు ఎద్దేవా చేశారు. ఇంతటితో టీడీపీ ఎమ్మెల్సీ ఆగలేదు. ఉద్యోగ సంఘాల నేతలు అక్కా బావా కబుర్లు చెబుతున్నారంటూ అత్యంత హీనంగా మాట్లాడారు.

సాధారణంగా ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీ ఉద్యోగులకు మద్దతు తెలుపుతుంది. వారి డిమాండ్లు ఎలాంటివైనా..ఏకీభవించి.. వారి తరపున ప్రభుత్వంపై వివిధ కార్యక్రమాల ద్వారా ఒత్తిడి తెస్తుంది. ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నామని ప్రకటిస్తుంది. కానీ మునుపెన్నడూలేని విధంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టీడీపీ.. భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏకంగా ఉద్యోగ సంఘాల నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. వారిని కించపరిచేలా మాట్లాడుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకే అశోక్‌బాబు ఉద్యోగ సంఘాల నేతలను కించపరిచేలా మాట్లాడారని స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు ఇంతగా దిగజారి మాట్లాడాలా..? అశోక్‌బాబు వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read : ఆ బాధలు విన్నా.. అందుకే ఇలా చేస్తున్నా – వైఎస్‌ జగన్‌