iDreamPost
android-app
ios-app

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ.. గంటా ఆలోచన ఆచరణలోకి వస్తుందా..?

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ.. గంటా ఆలోచన ఆచరణలోకి వస్తుందా..?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ నేతల్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఒకరు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కించేందుకు గంటా శ్రీనివాసరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రంగా ఆయన అనేక రాజకీయ ప్రతిపాదనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అందరికన్నా ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా.. తన స్థానంలో ఉద్యమానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉద్యమానికి రాజకీయంగా ఊపు తెచ్చేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్న గంటా శ్రీనివాసరావు.. తాజాగా మరో సరికొత్త ప్రతిపాదనను వెల్లడించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం తరఫున అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అఖిలపక్ష కార్మిక నేతలతో చర్చించిన తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన గంటా శ్రీనివాసరావు ఈ ప్రకటన చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా.. టీడీపీ ఓడిపోవడంతో సైలెంట్‌ అయ్యారు. ఆ పార్టీకి, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీలో చేరేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ వైపు కూడా ఆయన చూశారనే వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలకు ముందు కూడా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడంపై వార్తలు వెలువడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గంటా అంత క్రియాశీలకంగా పని చేయలేదు.

Also Read : ఉక్కును మంచిగానే ప్రైవేటీక‌రిస్తార‌ట‌!

దాదాపు 20 నెలల్లో మీడియాతోనూ ఆయన మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టీవ్‌ అయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలు ప్రారంభించిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తరచూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు. విశాఖ ప్రజా ప్రతినిధులందరూ రాజీనామా చేయాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. రాజీనామా చేసేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు.

విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అన్నింటిలోనూ టీడీపీనే గెలిచింది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ, పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసే విషయంపై సహచర ఎమ్మెల్యేలతో చర్చించని గంటా శ్రీనివాసరావు.. తానొక్కడినే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతున్నానే భావన కల్పించేందుకు ముందుగా రాజీనామా చేశారనే విమర్శలున్నాయి. ఆయన దారిలో నడిచేందుకు టీడీపీ ఎమ్మెల్యేలేవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గంటా ఒంటరయ్యారు. అందుకే ఇటీవల పదే పదే ఇతర ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం వల్ల మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారిన గంటా శ్రీనివాసరావు.. స్టీల్‌ప్లాంట్‌ వేదికగా చేస్తున్న రాజకీయాలు భవిష్యత్‌లో ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. రాజీనామా అస్త్రం, తిరుపతి ఉప ఎన్నికల్లో ఉద్యమం తరఫున పోటీ.. ఈ సరసన రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రతిపాదనలు గంటా చేస్తారో చూడాలి.

Also Read : బీజేపీ – జనసేన.. తిరుపతిలో పోటీపై క్లారిటీ