iDreamPost
android-app
ios-app

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. భారీగా గల్లంతైన ఓటు బ్యాంకు

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. భారీగా గల్లంతైన ఓటు బ్యాంకు

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. వార్డులు, డివిజన్లనే కాదు ఓట్లను కూడా భారీగా కోల్పోయింది. 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు భారీగా గండిపడింది. అదే సమయంలో వైసీపీ ఆఫ్‌ సెంచరీ మార్క్‌ దాటింది. సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లకు అతి సమీపంలో ఆగిపోయిన వైసీపీ.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ మార్క్‌ను అధిగమించింది. జనసేన కూడా ఓట్లను కోల్పోయింది. అదే సమయంలో జనసేన పార్టనర్‌ అయిన బీజేపీ ఓటు బ్యాంకును స్వల్పంగా పెంచుకుంది.

తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 23 సీట్లను గెలుచుకుంది. పోలైన ఓట్లలో ఆ పార్టీకి 39.17 శాతం ఓట్లు దక్కాయి. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్‌ శాతం భారీగా పడిపోయింది. ఆ పార్టీకి పోలైన ఓట్లలో 30.73 శాతం మేర మాత్రమే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. టీడీపీ 8.44 శాతం ఓట్లను కోల్పోయింది.

పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ టీడీపీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆ పార్టీ తరఫున ఒక్కరు కూడా  గెలవలేదు. తుని, మాచర్ల, పిడుగురాళ్ల, కనిగిరి, వెంకటగిరి, ధర్మవరం, డోన్, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, ఎర్రగుంట్ల, పుంగూరులలో టీడీపీ ఖాతానే తెరవలేదు. మరో 13 చోట్ల ఒక్క కౌన్సిలర్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రామచంద్రపురం, నరసాపురం, నిడదవోలు, పెడన, చీరాల, సూళ్లూరుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరు, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు, గుత్తి, యలమంచిలి మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డు చొప్పన మాత్రమే గెలవగలిగింది.

విజయనగరం, తిరుపతి, కడప కార్పొరేషన్లలో ఒక్క డివిజన్‌నే టీడీపీ గెలుచుకుంది. అనంతపురం కార్పొరేషన్‌లో ఖాతానే తెరవలేదు. మొత్తం మీద 86 పుర, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో 29 చోట్ల టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లైంది.

Also Read : మునిసిపల్ ఎన్నికలు -ప్రతిపక్షాలకు మిగిలిన మార్గమేంటి

కౌటింగ్‌ జరిగిన 11 కార్పొరేషన్లను, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకుగాను 73 చోట్ల అఖండ విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో తన ఓటు బ్యాంకును కూడా భారీగానే పెంచుకుంది. వైఎస్‌ జగన్‌ పాలనకు జైకొట్టేలా పట్టణ, నగర ఓటర్లు గంపగుత్తగా ఓట్లు వేశారు. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 52.63 శాతం ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.5 శాతం ఓట్లు రాగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో 50 శాతం మార్క్‌ను అధికార పార్టీ ధాటింది. వైసీపీకి పట్టణాలలో కంటే గ్రామాలలోనే బలం ఎక్కువనే భావన ఈ మున్సిపల్‌ ఎన్నికలను తుడిచిపెట్టాయి. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ వైసీపీ అజేయ శక్తిగా ఎదిగిందని మున్సిపల్‌ ఫలితాలు, ఆ పార్టీకి వచ్చిన ఓట్లు చెబుతున్నాయి.

బీజేపీతో పొత్తు వల్ల తాము నష్టపోయామని వాపోతున్న జనసైనికుల వాదన నిజమనేలా ఆ పార్టీలకు వచ్చిన ఓట్ల ద్వారా స్పష్టమవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన 4.67 శాతం మేర ఓట్లను సాధించింది. 21 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 5.53 శాతం ఓట్లు రావడం విశేషం. ఇక బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు రాగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి 2.41 శాతం ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌ ఓట్లు కూడా తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి 1.17 శాతం ఓట్లు రాగా.. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో 0.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఎం 0.81 శాతం, సీపీఐ 0.80 శాతం చొప్పన ఓట్లు పొందాయి. నోటాకు 1.07 శాతం ఓట్లు పడ్డాయి. స్వతంత్రులు 5.73 శాతం ఓట్లు పొందారు. స్వతంత్రుల్లో దాదాపు 90 శాతం మంది వైసీపీ రెబల్‌ అభ్యర్థులే కావడం విశేషం.

Also Read : టీడీపీ తిరోగమానానికి ఫలితాలు ఓ సూచి!