జగన్ జైలుకు పోతాడంట….

అమరావతి ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఉద్యమంలో అమరావతి ప్రాంత గ్రామాల రైతులు ఆది నుంచీ కీలక ప్రాత పోషిస్తున్నారు. టీడీపీ నేతల ప్రొద్భలంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారని. ఆ తర్వాత కొనసాగిస్తున్నారన్న ప్రచారం సాగింది. టీడీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చెప్పుకొస్తున్న మాటలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలతో రైతులు ఉద్యమంలో ముందుకెళ్లారు. రాజధానిని అమరావతి నుంచీ తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నిబంధనలు ఒప్పుకోవని, అలా చేస్తే లక్షల కోట్ల రూపాయల నష్ట పరిహారం రైతులకు చెల్లించాల్సి వస్తుందినీ.. ఇలా అనేక రకాల మాటలతో చంద్రబాబు రైతులకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రైతులు, మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు మాటల్లో వాస్తవం రైతులు అర్థం చేసుకోవడంతో టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.

ఈ సారి రైతుల ఉద్యమాన్ని కొనసాగించేందుకు.. వారిలో భరోసాను నింపేందుకు టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని పావుగా వాడుకున్నారు. రాజధాని తరలించాలంటే.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరంటూ రైతులకు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఇదే పాట పాడారు. దీంతో రైతులను కొద్ది రోజులపాటు ఉద్యమం చేసేలా ప్రేరేపించారు. అందులో భాగంగానే.. రైతులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తదితర బీజేపీ నేతల మాస్క్‌లు, ఫొటోలు చేతపట్టి నినాదాలు చేశారు.

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడించడంతో ఇన్నాళ్లు రైతులకు టీడీపీ నేతలు చెప్పినవి బూటకపు మాటలేనని అర్థమైంది. రాష్ట్రంలో ఎక్కడైనా రాజధాని పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రం స్పష్టం చేయడం, అదే విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరశింహారావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో రైతులు కొంత ఢీలా పడ్డారు.

మళ్లీ రైతుల్లో ఉత్సాహం నింపేందుకు, అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగుతందని నమ్మించేందుకు టీడీపీ నేతలు తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. తమ ముందు ఉన్న అవకాశాలన్నీ పోవడంతో.. టీడీపీ నేతలు ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ జైలుకు పోతారని రైతులకు చెబుతున్నారు. నిన్న సోమవారం రైతుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రైతులు ఉద్యమాన్ని కొనసాగిచేలా వారిలో జోష్‌ నింపేందుకు తన నోటికి పని చెప్పారు. ‘‘త్వరలోనే వైఎస్‌ జగన్‌ జైలుకు పోతారు. అప్పటి వరకే ఈ ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. అప్పటి వరకూ మనోధైర్యం కోల్పోకుండా ఉద్యమం కొసాగించాలి’’ అంటూ రైతులకు చెప్పకొచ్చారు.

రాజధాని ఉద్యమంలో రైతులకు టీడీపీ నేతలు ముందు నుంచీ చెబుతున్న మాటలు ఒట్టి బూటకమనే విషయం బుచ్చయ్య చౌదరి మాటల ద్వారా అర్థమవుతోంది. తాజాగా అందుకున్న.. జైలుకు జగన్‌.. పల్లవి రైతుల్లో ఏ స్థాయిలో నమ్మకం పెంచుతుంది..? ఉద్యమాన్ని కొనసాగించేందుకు టీడీపీ నేతలు చెబుతున్న మాటలు వారిలో ఎంత మేరకు విశ్వాసాన్ని నింపుతాయి..? వేచి చూడాలి.

Show comments