iDreamPost
iDreamPost
ఓటమి భయం వెన్నాడుతుంటే.. కుంటిసాకులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. పార్టీ సీనియర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అంతకంటే ఎక్కువగా మండిపడుతున్నారు. అధినేత నిర్ణయాన్ని ధిక్కరించి పోటీలో కొనసాగేందుకు తెగిస్తున్నారు. గ్రామాల్లో మనుగడ సాగించాలంటే, ఓట్ బ్యాంక్, వర్గాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని తెగేసి చెబుతున్నారు.
ఎక్కడికక్కడ ధిక్కారస్వరం
40 ఏళ్ల పార్టీని, దాని జెండా మోస్తున్న కార్యకర్తల భవిష్యత్తును వ్యక్తిగత ఎజెండాతో చంద్రబాబు ఫణంగా పెట్టడాన్ని పార్టీ క్యాడర్ ఏమాత్రం సహించలేకపోతోంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాయకులు నిర్ణయిస్తున్నారు. పలువురు పార్ట్ పదవులకు రాజీనామాలు కూడా చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ తన నియోజకవర్గమైన పెందుర్తిలో అన్ని స్థానాల్లో పోటీలో ఉంటామని స్పష్టంచేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ పోటీ చేస్తామని ఆ నియోజకవర్గ సీనియర్ నేత హనుమంతరాయ చౌదరి చెప్పారు.
లోకేష్ ఓడిపోయిన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండల నేతలు కూడా పోటీకి సై అన్నారు. విశాఖ జిల్లా రవికమతంలోనూ ఇదే పరిస్థితి. విజయనగరం జిల్లాలో అశోకగజపతి రాజు ఇలాకా అయిన విజయనగరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ అభ్యర్థులను పోటీలో కొనసాగిస్తామని ఆ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అదితి గజపతి రాజు కుండబద్దలుగొట్టారు. ఇదే జిల్లా భోగాపురం మండల టీడీపీ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా చాలా ప్రాంతాల్లో నాయకులు ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు.
మీకు అవసరమైన ఎన్నికలు మాకు అక్కర్లేదా?
ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిత్యం ఏదో రూపంలో ప్రజల్లో ఉండటం అవసరం. దానికి ఎన్నికలకు మించిన వేదిక ఇంకేముంటుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో టీడీపీ ఎన్నడూ వెన్ను చూపలేదని గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్లతరబడి జెండా మోస్తూ మీరు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కావడానికి శ్రమిస్తున్న మేము ప్రజాప్రతినిధులమయ్యే అవకాశాన్ని ఏకపక్షంగా కాలదన్నుతారా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పరిషత్ ఎన్నికలు చంద్రబాబుకు అక్కర్లేదేమో గానీ.. గ్రామాల్లో తమ వర్గాన్ని కాపాడుకోవడం తమకు అవసరమని.. అందుకోసమే ఎన్నికల్లో పాల్గొని తీరుతామని టీడీపీ క్యాడర్ స్పష్టం చేస్తోంది.
కాగా, బహిష్కరణ నిర్ణయంపై పార్టీలో రేగిన అసంతృప్తి జ్వాలలు నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేశాయి. దాన్ని చల్లబరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినా.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఎప్పుడో పూర్తి అయిన నేపథ్యంలో సాంకేతికంగా పోటీ నుంచి తప్పుకోవడం కుదరదు. దీన్ని అవకాశంగా తీసుకుని పార్టీ అభ్యర్థులు వ్యక్తిగతంగా పోటీ చేయవచ్చని నాయకత్వం దిగువస్థాయికి సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.