స్థానిక ఎన్నికల రద్దు డిమాండ్‌కు కారణం దొరికింది..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేసినప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తున్న టీడీపీ.. ఇప్పుడు స్వరం పెంచుతోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని చెప్పిన టీడీపీ.. ఆ తర్వాత ఆ డిమాండ్‌ను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. సమావేశానికి హాజరైన మెజారిటీ రాజకీయ పార్టీలు ప్రస్తుతం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి.. కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పుడు టీడీపీ ఆయా పార్టీల అభిప్రాయాలను ఫోకస్‌ చేస్తోంది. తన డిమాండ్‌కు వివిధ రాజకీయ పార్టీలు చెప్పిన అభిప్రాయాన్ని జోడిస్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఇదే విషయం చెప్పుకొచ్చారు. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా విరివిగా ప్రచారం చేసే అవకాశం కన్పిస్తోంది. ఏకగ్రీవాలలో అక్రమాలు జరిగాయంటూ.. న్యాయస్థానాలను ఆశ్రయించిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ప్రస్తుతం రోజుకు దాదాపు మూడు వేల చొప్పున కరోనా కేసులు నమోదువుతున్న తరుణంలో ప్రభుత్వం, అధికార వైసీపీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టంగా చెబుతున్నా.. టీడీపీ మాత్రం ఎన్నికల నిర్వహణ సమస్య కానేకాదు.. కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపిస్తుండం అనేక సందేహాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోమారు విచారణ జరగబోతోంది. ఈ లోపు తాను నిర్వహించిన సమావేశంలో రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేసేందుకు కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ యోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరమే.

Show comments