iDreamPost
android-app
ios-app

టీడీపీ కూడా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తుందా?

టీడీపీ కూడా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తుందా?

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా కష్టపడుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా అయినా సరే అధికారంలోకి తీసుకురావాలని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పోరేషన్ పరిధిలో, పంచాయితీల పరిధిలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్ లిస్టు ల మీద దృష్టి సారించి ఓటు పోయిన వాళ్లకు కొత్త ఓట్లు నమోదు చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక కార్యకర్తల ద్వారా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. 

అక్కడి వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు కార్యకర్తలపై తలకు మించిన భారం అయింది ఇదే. సిఎం వైఎస్ జగన్… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ ల నియామకం చేపట్టారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని… ప్రజల వద్దకు తీసుకు వెళ్ళడంలో సఫలం కావడంతో టీడీపీ అధిష్టానం కూడా ఇదే ఆలోచన చేసింది. పార్టీని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళడానికి… ప్రతీ 50 ఇళ్ళకు ఒక కార్యకర్త ఉండాలి అనే ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను ఇంచార్జ్ లకు అప్పగించారు.

ఇది క్రమంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వరకు వెళ్తుంది. ఇందులో కార్యకర్తలకు  ఆర్థికసహాయం లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వాళ్లకు వంద ఇళ్ళ బాధ్యతను అప్పగించడం వివాదం అవుతుంది. తలకు మించిన భారాన్ని అభిమానం తో మోస్తున్నామని చాలా మంది బాధ పడుతున్నారు. పార్టీకి విధేయులు గా ఉన్న వారి మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకు వస్తున్నారు. గ్రామాల్లో వ్యాపారాలు చేసుకునే వారిని ఎంపిక చేయడం వాళ్లకు ఈ బాధ్యతలు, జూమ్ కాల్స్ పెట్టడంతో వాళ్ళ వ్యాపారాలకు సైతం ఇబ్బందిగా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళను కూడా ఈ పనికి వాడటంతో చాలామంది టీడీపీ పోస్ట్ లు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా ఇది టీడీపీని గ్రౌండ్ లెవల్ లో ఇబ్బంది పెడుతుందని కార్యకర్తలను దూరం చేస్తుందని అంటున్నారు. అధిష్టానం దృష్టికి నియోజకవర్గాల ఇంచార్జ్ లు తీసుకువెళ్ళినా సరే లాభం లేకపోయింది. ఈ పని మీదనే ఉంటే తమకు కుటుంబపోషణ భారంగా మారుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ లు, బ్లాక్ ల పేరుతో విభాగాలు చేసి, టీంలు పెట్టుకుని ఇలాంటివి చేస్తున్నారు. దీనితో మహిళా కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కుటుంబాలకు సమయం కేటాయించడం లేదనే ఆవేదన వారిలో ఉందని అంటున్నారు.

Also Read : ఈ డాన్స్ లు ఏంటీ…? టీడీపీ కార్యక్రమాల్లో వివాదం అవుతున్న పాట…!