iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లో ఉండటాన్ని కొందరు నందమూరి అభిమానులు వ్యతిరేకిస్తుంటారు. అది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాబట్టి.. నందమూరి కుటుంబానికి చెందిన వారసులే ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. టీడీపీ నందమూరి కుటుంబానికి మాత్రమే సొంతమనే అభిప్రాయం ఇప్పటికీ కొందరిలో బలంగా ఉంది. తాజాగా నందమూరి వారసుడు తారకరత్న సైతం అదే అర్థమొచ్చేలా కామెంట్స్ చేశాడు. ఓ వైపు చంద్రబాబుని పొగుడుతూనే.. మరోవైపు ఈ పార్టీ మాది అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
తాజాగా గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పార్టీలో మీ పదవి ఏమిటని అడగగా.. పదవిదేముంది, పార్టీనే మాది, ఇది మా తాతగారు పెట్టిన పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదవులు అనేది నందమూరి కుటుంబం ఎప్పుడూ కోరుకోలేదు.. తాము ప్రజల కోసం పోరాడుతాం, పోరాడుతూనే ఉంటాం అంటూనే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించాడు. టీడీపీ పగ్గాలు నందమూరి వారసులు చేపడిటే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందనే విషయాన్ని ప్రస్తావించగా.. ప్రస్తుతం మావయ్య చంద్రబాబుని మించిన నాయకుడు లేడని ఆయన చెప్పడం కొసమెరుపు. ఒకవైపు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసిస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ మాదని తారకరత్న కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడా అని అడగగా.. టైం వచ్చినప్పుడు తమ్ముడు కూడా కచ్చితంగా వస్తాడని తారకరత్న అన్నాడు.
ప్రస్తుతం టీడీపీలో తారకరత్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ మాది అని చెప్పడం.. త్వరలో చంద్రబాబు చేతుల్లో నుంచి పార్టీని నందమూరి కుటుంబం తీసుకుంటుంది అనేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రస్తుతం టీడీపీ కష్టాల్లో ఉంది కాబట్టి.. జూనియర్ ని మళ్లీ టీడీపీకి దగ్గర చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. మరి తారకరత్న మాటల మర్మం.. టీడీపీని చంద్రబాబు నుంచి దూరం చేయడమా? లేక టీడీపీకి జూనియర్ ను దగ్గర చేయడమా? అనేది ఆయనకే తెలియాలి.