iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకూ అంటుకుంటుంది అనేనా భయం?

చంద్రబాబుకూ అంటుకుంటుంది అనేనా భయం?

గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల అరెస్టులు ఆంధ్రప్రదేశ్ లో కొన సాగుతున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో.. ఆయనను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి లు మరో కేసులో అరెస్ట్ అయ్యారు. పలు అక్రమాల భాగస్వామ్యంలో టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే… నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీ పైబర్ గిడ్ సెట్ టాప్ బాక్సుల కొనుగోలులో, రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుక వంటి పథకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు మంత్రివర్గం సిఫార్సు చేసింది. చంద్రబాబు పై భారీ స్థాయిలోనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రాజధాని పేరిట జరిగిన భూ కుంభకోణంలో కూడా ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో ఈ విషయం లేవనెత్తారు. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోంది.

అలాగే పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు, టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మరిన్ని పథకాలలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆ పార్టీ హయాంలో నే ఎంతో మంది నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు వెదికే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి కావడం, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం అంత తేలిక కాదు. అయితే.. పక్కా ఆధారాలు దొరికితే ఎవరైనా కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. ఈ వార్తలు తెలుగుదేశం వర్గాల్లో ఒణుకు పుట్టిస్తున్నాయి.

ఒకవేళ అరెస్టుల పర్వం చంద్రబాబు వద్ద వరకూ వస్తె అడ్డుకునేందుకు సిద్దంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు యోచిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే… పక్కా ఆధారాలు ఉంటే కానీ ఎవరినీ అరెస్ట్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే ఎంతటి వారినైనా వదిలి పెట్టొద్దని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం ఎంత వరకూ కొనసాగుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.