Idream media
Idream media
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో పంచకర్ల వైసీపీ లో చేరారు. ఆయనకు వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు వెంట పంచకర్ల రమేష్‌బాబు సీఎం జగన్ వద్దకు వచ్చారు.
యలమంచిలి, పెందుర్తి నుంచి గతంలో రమేష్ శాసన సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యు.వి.ఆర్.రాజు(కన్నబాబు) గెలుపొందారు. ఓటమి తర్వాత కూడా పంచకర్ల టీడీపీలోనే కొనసాగారు. అయితే మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా టీడీపీ అధినేత వ్యతిరేకించాడన్ని పంచకర్ల అంగీకరించలేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడంతో ఆ పార్టీకి ఐదు నెలల క్రితం రాజీనామా చేశారు.
వైసీపీలో చేరిన తర్వాత పంచర్ల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన మనుషులే అభివృద్ధి చెందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారని, తమ ప్రాంతానికి అన్యాయం చేయలేక టీడీపీ నుంచి బయటకు వచ్చేశానని పంచకర్ల పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలో వస్తారని జోస్యం చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతోందని కొనియాడారు. లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేసి పెత్తనం చెలాయించాలని చూశారని పంచకర్ల విమర్శించారు.