iDreamPost
android-app
ios-app

పాటపట్నంలో పెట్రేగిన టీడీపీ నేత కలమట

  • Published Apr 17, 2022 | 7:05 PM Updated Updated Apr 17, 2022 | 8:37 PM
పాటపట్నంలో పెట్రేగిన టీడీపీ నేత కలమట

వరుస పరాజయాలు, అధికారం చేతిలో లేకపోవడం తెలుగుదేశం నేతలను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో అనేకమంది టీడీపీ నేతలు ఉన్మాదుల్లా మారుతున్నారు. పార్టీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో వారిలో అసహనం నానాటికీ పెరిగిపోతోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అమ్మవారి ఉత్సవాల్లో నిబంధనలు పాటించమని సూచించిన పోలీసులపై దౌర్జన్యానికి తెగబడితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు పూనుకున్న ఎంపీడీవో ఇతర అధికారులపై మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వీరంగం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ విధినిర్వహణకు ఆటంకం కలిగించారు.

ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారో చూస్తాం

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత నెలలో మాజీ ఎమ్మెల్యే కలమట ఊరినిండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. నెల రోజులు కావస్తున్నా వాటిని తీయలేదు. రాబోయేది గాలుల సీజన్. ఈదురు గాలులు వేస్తే ఫ్లెక్సీలు పడిపోయి ప్రమాదాలు సంభవించవచ్చని భావించిన అధికారులు వాటిని తొలగించాలని నిర్ణయించారు.ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పాతపట్నం పంచాయతీ ఈవో, ఇతర సిబ్బంది రంగంలోకి దిగి తొలగింపునకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పెద్దసంఖ్యలో అనుచరులను వెంటేసుకుని వచ్చి వీరంగం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్దిచెప్పడానికి, అవి ఉంటే ప్రమాదాలు జరుగుతాయని వివరించడానికి ప్రయత్నిస్తున్నా చెవికెక్కించుకోకుండా వారి పైకి వెళ్లారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దురుసుగా వ్యవహరించారు. వివాదంతో సంబంధంలేని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారో చూస్తాను అంటూ సవాల్ చేశారు. మీ సంగతి తేలుస్తాను, మిమ్మల్ని వదిలేది లేదు అని బెదిరించారు. అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. దాంతో అధికారులు వెనుదిరిగారు.

రాజకీయ అసహనంతోనే..

2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యే అయిన కలమట 2016లో టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి ఆ పార్టీలోకి జంప్ చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రజావ్యతిరేకత వల్ల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రెడ్డి శాంతి చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా కొంతకాలంగా టీడీపీలోనే ఆయనకు వ్యతిరేకంగా మరో బలమైన నేత సవాల్ చేస్తున్నారు.పార్టీనేత మామిడి గోవిందరావు, కలమటకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆయన అటు మామిడి, ఇటు కలమట ఎవరు తన వద్దకు వస్తే వారికే టికెట్ అన్నట్లు డబుల్ గేమ్ ఆడుతున్నారు. దాంతో అధికారం లేక.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లభిస్తుందన్న భరోసా కూడా లేక కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో ఉన్న కలమట దాన్ని అధికారులపై చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.