iDreamPost
iDreamPost
సైకిల్‌కు ఎంత గాలి కొట్టినా ముందుకు కదలడం లేదు.. టైర్లకు అయిన పంచర్లు అలాంటివి మరి. సై‘కిల్’ అయిపోతున్న పార్టీని కాపాడుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పడుతున్న పాట్లు అన్నీఇన్ని కావు.. నిరసనల పేరుతో చేసిన, చేస్తున్న డ్రామాలు బట్టబయలవుతున్నా.. కొత్త కొత్త డ్రామాలకు తెరలేపుతోంది టీడీపీ. ఇప్పుడు కొత్తగా ‘ఐటీడీపీ బ్లాగ్.కామ్’ పేరుతో కొత్త వెబ్ సైట్ ప్రారంభించింది. ఎందుకయ్యా అంటే.. టీడీపీ కార్యకర్తలు, ఇతరుల కోసమట. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల పేరుతో ప్రభుత్వ వేధింపులు, కేసులను ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలు, ఇతరులు, ప్రభుత్వ పథకాల్లో కోత, అనర్హతగా ప్రకటించినా, ఇతరత్రా కేసులు, వేధింపులు ఎదురైతే ఈ వెబ్‌సైట్ ద్వారా సమస్యలను టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చంట. ఇలా వెబ్ సైట్ పెట్టి హడావుడి చేయడం ఇదే మొదటి సారి కాదు.. గతంలోనూ టీడీపీ చేసింది. ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని, తప్పుడు ఆరోపణలు చేయాలనేదే టీడీపీ ఉద్దేశం. అందుకే ఈ డ్రామాలు.
ఆ.. ఊ.. అంటే లోకేశ్ ఆవేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఈ మధ్య ఆ.. ఊ.. అంటే ఆవేశపడిపోతున్నారు. ఐటీడీపీ బ్లాగ్.కామ్‌ను ప్రారంభించిన లోకేశ్.. సోషల్ మీడియా కేసులంటూ పోలీసులు ఇబ్బంది పెట్టినా, చిల్లర గ్యాంగులు బెదిరించినా వెబ్‌సైట్ లో సమాచారమివ్వాలట. రోజురోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందట. అవును మరి. అందుకే కదా.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. అణచివేతను ఈ ప్రభుత్వం నమ్ముకుందట.. అప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అణచివేసింది ఎవరు సారూ. ప్రత్యేక హోదా అంటే అరెస్టు చేస్తామని బెదిరించింది ఎవరు నాయనా?? లోకేశ్ అంతటితో ఆగలేదు.. ‘మింగ మెతుకు లేదు గానీ, మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్లుగా వైఎస్ జగన్ తీరు ఉందట. ఈ సామెత ఎవరికి సరిపోతుందో.. ఏపీ ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన పని లేదు. అదంతా కాదు.. టీడీపీ హయాంలో కొందరు సోషల్ మీడియా పేజీలు నిర్వహించే వారిని అరెస్టు చేసి వేధించారు కదా.. అప్పుడు వేధింపులకు గురైన వాళ్లకు కూడా న్యాయం సాయం అందిస్తారా?
4 నెలల కిందట తెచ్చింది ఏమైందో?
తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మార్చి 2021న ‘ఏపీ ఫైట్స్ కరోనా’ అనే పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఏపీ ప్రజలు తమ సమస్యలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే.. తమ పార్టీ తరఫున అధికారులకు పంపించి సమస్యలు పరిష్కారించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నిజానికి ఆ వెబ్ సైట్ ప్రారంభించింది వీళ్లు సాయం చేసేందుకు కాదట.. తమకు వచ్చిన సమస్యలను నియోజకవర్గాలు, జిల్లాల వారీగా క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపిస్తామని అప్పట్లో చెప్పారు. అంటే.. వీళ్లు చేసేదేం లేదు. అప్లికేషన్లను ఫార్వర్డ్ చేస్తారంతే. ఆ వెబ్ సైట్ ప్రారంభించి నాలుగు నెలలు అయిపోయింది.. ఇప్పటిదాకా ఏం చేశారో..? ఎవరికి సాయం చేశారో? ఎవరికీ తెలియదు. టీడీపీ లీడర్లు కూడా బయటపెట్టలేదు. ఇప్పుడు ఆ వెబ్ సైట్ పని చేస్తోందో లేదో కూడా టీడీపీ లీడర్లే చెప్పాలి.
అమరావతిపైనా ఒక వెబ్ సైట్
అమరావతి కోసం ఉద్యమించాలని పిలిచి పిలిచి చంద్రబాబు అలిసిపోయారు. కానీ ప్రజల్లో మాత్రం స్పందన లేదు. అయినా పట్టు వదలని చంద్రాబాబు.. అమరావతిపై ప్రజలు స్పందన తెలియజేయాలంటూ ‘ఏపీ విత్ అమరావతి’ అనే వెబ్‌సైట్‌ను 2020 ఆగస్టులో ప్రారంభించారు. కనీసం అక్కడైనా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశించారు. ప్రస్తుతం ఏపీ విత్ అమరావతి వెబ్ సైట్ పరిస్థితేంటో ఎవరికీ తెలియదు. ఎంత మంది స్పందించారు? ఏమని స్పందించారు? అనే విషయాలేవీ బయటికి చెప్పలేదు. అధికార వికేంద్రీకరణ చేస్తున్న ప్రభుత్వాన్ని.. అడ్డుకునేందుకు చేపట్టిన ఈ క్యాంపెయిన్‌ను ప్రజలు పట్టించుకోలేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఐటీడీపీ వచ్చింది.. రేపు వియ్ టీడీపీ వస్తుంది.. అలా వస్తా ఉంటాయి.. పోతా ఉంటాయి.