ఆ ఇద్దరు రెడ్లు బెదిరిస్తున్నారు.. గవర్నర్ కు టిడిపి ఫిర్యాదు

శాసనమండలితో సంబంధం లేని వ్యక్తులు గ్యాలీరీల్లో కూర్చుని ఎమ్మెల్సీను బెదరిస్తున్నారని టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి మండలి గ్యాలరీలో కూర్చుని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.

మూడు రాజధానుల బిల్లుపై మండలిలో గందరగోళం సంగతి తెలిసిందే. మంగళవారం మండలిలో హైడ్రామా నడిచింది. బిల్లును తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నించగా రూలింగ్ 71 కింద టీడీపీ నోటీస్ ఇచ్చి బ్రేకులు వేసింది. దీంతో సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య రగడ నడిచింది. దాదాపు ఐదుసార్లు మండలి వాయిదా పడింది.

Read Also: తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్.

సాయంత్రానికి కధ మారింది. రూల్ 71 కింద చర్చకు టీడీపీ ఇచ్చిన నోటీసును మండలి చైర్మన్ షరీఫ్ చర్చకు అనుమతించారు. సభలో వాడీవేడి చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో టీడీపీ పైచేయి సాధించింది. ఓటింగ్‌లో టిడిపి ప్రవేశ పెట్టిన రూల్ 71 కి అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు.

వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ రెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేశారు. మరో ఎమ్మెల్సీ శత్రుచర్ల ఓటింగ్ సమయానికి మండలి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే తమ వారిని విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి బెదిరిస్తున్నారని యనమల ఫిర్యాదు చేశారు.

Show comments