iDreamPost
android-app
ios-app

రాజప్ప ఈ మాట అంటుంది మీరేనా..?

రాజప్ప ఈ మాట అంటుంది మీరేనా..?

మంత్రివర్గం ఏర్పడిన రోజున చెప్పిన విధంగానే రెండున్నరేళ్లకు మంత్రులు రాజీనామా చేసినా.. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. వైసీపీలో చీలిక వస్తుందని ఒక నేత అంటే.. రెండున్నరేళ్లుగా మంత్రులు కాలక్షేపం చేశారని, రాబోయే వారు కూడా అదే ధోరణి కొనసాగిస్తారంటూ మరో టీడీపీ నేత విమర్శిస్తున్నారు. మంత్రుల రాజీనామాలపై తాజాగా స్పందించిన మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప.. ఐదేళ్లు పాలన చేయమంటే.. రెండున్నరేళ్లకే మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాదు రెండున్నరేళ్లలో మంత్రులు కాలక్షేపం చేశారని, పట్టు సాధించలేక పోయారంటూ వ్యాఖ్యానించారు. పాత మంత్రులు ఒరగబెట్టింది ఏమీలేదని, వచ్చే మంత్రులు కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తారంటూ జోస్యం చెప్పారు.

రాజప్పపై వైసీపీ నేతల మాటల తూటాలు..

మంత్రులపై విమర్శలు చేసిన రాజప్పపై వైసీపీ నేతలు మాటల తూటాలు వదులుతున్నారు. పట్టు సాధించలేకపోయారు, కాలక్షేపం చేశారు.. ఒరగబెట్టింది ఏమీ లేదంటున్న రాజప్ప.. ఆయా మంత్రులు ఎలా పని చేశారో అందరికీ తెలుసని వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. రెండున్నరేళ్లలో పట్టుసాధించలేక పోయారంటున్న చిన రాజప్ప.. గత ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖ బాధ్యతలు చేపట్టి ఐదేళ్లు పదవిలో ఉన్న చినరాజప్ప ఒరగబెట్టింది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. హోం శాఖపై పట్టు సాధించారా..? కాలక్షేపం చేశారా..? అని ప్రశ్నిస్తున్నారు. పట్టు సాధించి ఉంటే.. కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేని వారంటూ అప్పట్లో సొంత పార్టీ నేతలే ఎందుకు మాట్లాడారంటూ చినరాజప్పకు చురకలు అంటిస్తున్నారు.

మంత్రుల రాజీనామా విడ్డూరం ఎలా అవుతుంది..?

రెండున్నరేళ్లకు మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందని చినరాజప్ప వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 175 మంది ఎమ్మెల్యే సీట్లకు గాను వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. అందరికీ అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో.. మంత్రివర్గం ఏర్పాటు చేసిన రోజునే .. రెండున్నరేళ్లకు 90 శాతం మంది తప్పుకుంటారని, కొత్త వారికి అవకాశం ఇస్తానని సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. రాజీనామా చేసిన మంత్రుల అనుభవాన్ని పార్టీ కోసం ఉపయోగించుకునేందుకు వారికి జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ముందుగా అనుకున్నట్లు మంత్రులు రాజీనామా చేస్తే విడ్డూరం ఎలా అవుతుందో చినరాజప్పే చెప్పాలి. చంద్రబాబు హయాంలో కొంత మంది మంత్రులను తప్పించి.. వారి స్థానంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం విడ్డూరం అవుతుంది గానీ.. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తే విడ్డూరం ఎలా అవుతుందని అధికార పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.