Idream media
Idream media
మనలోని భయాన్ని బయటపడకుండా ఉండాలంటే ఎదుటివాడు భయపడుతున్నాడని చెప్పడం అనేది ఓ విధానం. ఈ విధానాన్నే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు అనుచరిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన మాదిరిగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో కకావికలమైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలు అష్టకష్టాలు పడుతున్నారు. పార్టీలో భవిష్యత్ ఉందని, వైసీపీకి ఇదే చివరి ఛాన్స్ అని, ప్రజా వ్యతిరేకత వచ్చిందని.. ఇలా తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు.
టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడైన అచ్చెం నాయుడు ఈ విషయంలో బాగా ముందున్నారు. బాబుతో పోటీ పడుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెంనాయుడు తమలోని భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ భయపడుతోందంటూ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే వైసీపీ అడ్డుపడుతోందంటూ మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత చూసే వైసీపీ వెనుకంజ వేస్తోందని అధికార పార్టీ నేత మాదిరిగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిలను ఎవరు అడ్డుకోవాలని చూశారో అందరికీ తెలిసిన విషయమే. రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ ఇచ్చారంటూ కర్నూలు టీడీపీ నేత, చంద్రబాబు హాయంలో జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా పని చేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి కోర్టులను ఆశ్రయించారు.
మొత్తం మీద 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి.. నామినేషన్లు కూడా పూర్తయ్యే తరుణంలో తమవాడైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో కరోనా వైరస్‌ను బూచిగా చూపి వాయిదా వేయించారు. ఎవరినీ సంప్రదించకుండా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఎన్నికలను ఎలా వాయిదా వేశారు..? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి..? అన్నది రాష్ట్రంలో రాజకీయాలను గమనిస్తున్న వారందరికీ తెలుసు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు వెళ్లినా తమదైన శైలిలో ఎవరు అడ్డుకున్నారో కూడా విధితమే.
అప్పుడు లేని కరోనా వైరస్‌ను చూపి ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఇప్పుడు కరోనా వైరస్ కేసులు వేలల్లో వస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం వెనుక లక్ష్యం ఏమిటి..? రమేష్‌కుమార్ నిర్ణయానికి టీడీపీ నేతల మద్ధతు తెలపడం వెనుక మర్మం ఏమిటో తెలియంది ఏమీ కాదు. ఆది నుంచి ఎన్నికలను అడ్డుకున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ అడ్డుకుంటోందని విమర్శించడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా వైసీపీ ఎన్నికలకు భయపడుతోందంటూ అచ్చెం నాయుడు తమలోని భయాన్ని దాచుకునే ప్రయత్నం చేయడంలో ఆయనకున్న రాజకీయ అనుభవం బాగా ఉపయోగపడినట్లుగా ఉంది.