Idream media
Idream media
అచ్చెం నాయుడు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసే సమయంలో గత నెల 31వ తేదీన చోటు చేసుకున్న ఘటనలో మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన కింజారపు అప్పన్నపై అచ్చెం నాయుడు ప్రోద్బలంతో ఆయన సోదరుడు హరిప్రసాద్, టీడీపీ నేతలు దాడి చేశారు. అప్పన్నతోపాటు, టెక్కలి వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాస్, ఇతర వైసీపీ నేతలు, అడ్డు వచ్చిన పోలీసులపై కూడా దాడికి పాల్పడిన ఘటనలో 22 మందిపై కోట బొమ్మాళి పోలీసులు కేసులు నమోదు చేశారు. 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరికొంత మంది పరారీలో ఉన్నారు. స్వగ్రామానికి వచ్చిన అచ్చెం నాయుడును ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గ్రామంలో పట్టు కోసం..
ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిమ్మాడ గ్రామంలో రాజకీయంగా తమదే పైచేయి కావాలని అచ్చెం నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్ చేత సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పోటీ లేకుండానే ఏకగ్రీవం చేసుకోవాలని భావించగా.. అచ్చెం నాయుడు దాయాది కింజారపు అప్పన్న రూపంలో పోటీ ఎదురైంది. అప్పన్న గతంలో కాంగ్రెస్ పార్టీలోనూ, ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో క్రియాశీలంగా పని చేస్తున్నారు. అప్పన్న నామినేషన్ వేయకుండా ఉండేందుకు అచ్చెం నాయుడు శతవిధాలుగా ప్రయత్నించారు. నామినేషన్ రోజు అచ్చెం నాయుడు సోదరుడు హరిప్రసాద్ అప్పన్నపై జులుం ప్రదర్శించారు. నామినేషన్ పత్రాలు చించివేశారు. చివరకు పోలీసులు సహకారంతో అప్పన్న నామినేషన్ వేయడంతో దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత నిమ్మాడ పంచాయతీలో పోలింగ్ జరగబోతోంది. గత చరిత్ర దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. సర్పంచ్ అభ్యర్థి అప్పన్నకు భద్రత కల్పించారు.