iDreamPost
iDreamPost
ఐటీ సంస్థల కేంద్రంగా ఏపీ మారుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను తీర్చిదిద్దే రహేజా వంటి కీలక సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంతో ఐటీ కంపెనీలు ఒక పాఠాన్ని నేర్చుకున్నాయి. ఒకేచోట కేంద్రీకృతమవడానికి బదులు చిన్న పట్టణాల వైపు విస్తరించాలనుకుంటాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలను సూదంటురాయిలా ఆకట్టుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, తాము కల్పించే సౌకర్యాల గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది.
ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 3,000 సీటింగ్ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. మొదటి దశలో 1,000 మందితో పని ప్రారంభించనుంది. సంస్థకు కావాల్సిన వసతుల కోసం, మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.
విజయవాడలో ఎదుగుతున్న హెచ్‌సీఎల్, తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే ప్లాన్ రెడీ చేసింది. విశాఖలో మరో పెద్ద కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటుచేయాలన్నదానిపై హెచ్‌సీఎల్ ప్రతినిధులు కార్యచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో విస్తరించిన అదానీ గ్రూపు, రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల్లో డేటా సెంటర్‌తో పాటు, ఐటీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనుంది.
ఇలా దిగ్గజ కంపెనీలు, యాంకర్ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో, సహజంగానే ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థలు మౌళిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధంచేసుకొంటున్నాయి. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ ఆర్బిట్‌మాల్ షాపింగ్ మాల్‌తో, హైదరాబాద్ ను తలదన్నేలా ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది.
మరో టెక్ దిగ్గజం టెక్ మహీంద్రాకూడా విజయవాడకు విస్తరిస్తున్నట్లు సీఈవో సీపీ గుర్నాని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. విశాఖలో ఇప్పటికే టెక్ మహేంద్ర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్ చేశారు. దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్, రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరారు. ఇప్పుడు టెక్ మహేంద్ర విస్తరణను ప్రారంభించింది. మేథా టవర్స్‌లో 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్య 1,000కి చేరనుంది. ఆ మేరకు తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది.
హైదరాబాద్ లో ఊడలు దిగిన ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్ కూడా, విజయవాడలో తమ కేంద్రాన్ని ఎర్పాటుచేయాలనుకొంటోంది. ఈ సంస్థకూడా 1,000 మంది సీటింగ్ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నది ప్లాన్. ముందు 200–300 సీటింగ్ తో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖలో భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.
అంతర్జాతీయ ఐటీ నిపుణుల్లో 20 శాతం ఏపీ నుంచే ఉన్నారన్నది అంచనా. కోవిడ్ తర్వాత చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి సిటీలకు వెళ్లి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అంతెందుకు ఐటీ కంపెనీల్లో 10 శాతం మించి ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు. ఉద్యోగులను తమ దగ్గరకు పంపించడానికి బదులు, తామే వాళ్లుంటున్న సిటీలకు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకొంటోంది.