Idream media
Idream media
పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి బాహ్యమైన, చట్టవిరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు. నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాఖానీ షాపు మాత్రమే. జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబడటం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు’. 1969లో మార్చి 16న తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమెల నాగిరెడ్డి అన్న మాటలివి. ఈ మాటలు అని అప్పుడే దాదాపు అర శతాబ్ది గడుస్తుంది. ఈ నిరర్ధక చర్చలకు పరిమితం కాకుండా ‘ప్రజల్ని విప్లవ కార్యాచరణకు కదిలించటమే కర్తవ్యం’గా ఆ వేదిక నుంచి ప్రకటించి దాని ఆచరణకు పూనుకున్నందుకు ఆయనతో పాటు, మరో 67 మంది పైనా హైదరాబాద్‌లో ఒక కుట్ర కేసు బనాయించారు. స్వతంత్ర భారత దేశంలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కేసుగా (తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసుగా) ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది.
చట్టబద్ధంగా ప్రజలచే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేక హత్యలు- దోపిడీలకు ప్రజలను పురిగొల్పి కూలదోయటానికి కుట్ర పన్నారని వారిపై నేరారోపణ చేశారు. తమ కార్యక్రమాలు న్యాయ విరుద్ధం కాదని ప్రజల్ని నానా ఇబ్బందులూ, హింసలూ పెడ్తూ విదేశీ గుత్త సంస్థలకు, సామ్రాజ్య వాదులకు తొత్తులుగా మారిన ప్రభుత్వానిదే కుట్ర అని సమాధానమిస్తూ ఆ కేసుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 313 సెక్షన్ ప్రకారం ఆయన చెప్పిన సమాధానమే ‘తాకట్టులో భారత దేశం’ గ్రంథంగా వెలువడింది. కేవలం వామపక్షీయులే గాక మెజారిటీ మేధావులు దాన్నో ప్రామాణికమైన, సత్య నిరూపితమైన గ్రంథంగా భావిస్తున్నారు.
ఆంధ్ర, మద్రాసు, కేరళ రాష్ట్రాలు కల్సి వున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. అధికార పార్టీతో సమానంగా కమ్యూనిస్టు సభ్యులున్న కర్నూలు శాసనసభలోనూ ఆయన ప్రతిపక్ష నాయకుడు. హైదరాబాద్‌కు మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష ఉపనాయకుడు (అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడు). రాజాజీ, ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి లాంటి ఉద్ధండులైన ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న ధీశాలి. కమ్యూనిస్టులంటే చాలా చౌకబారు మనుషులనే అభిప్రాయమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన అఖిలపక్ష సభలో 3 గంటలపాటు సాగిన నాగిరెడ్డి ఉపన్యాసానికి ముగ్ధుడై ఆయన నివాసానికెళ్లి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నానని నాగిరెడ్డిని అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారట.
అనంతపురం జిల్లా తరిమెలలో 1917 ఫిబ్రవరి 11న ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో నాగిరెడ్డి జన్మించారు. గిండి థియోసాఫికల్ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించే సమయంలోనే అనీబిసెంటు శిష్యరికం లభించింది. ఆ తర్వాత రుషివ్యాలీలో స్కూలు ఫైనల్ వరకు చదివి, మద్రాసు లయోలా కాలేజిలో చేరారు. ఉన్నత విలువలతో రుషి వ్యాలీ, గిండీ స్కూల్స్‌లో చదివిన నాగిరెడ్డి ఆ కృత్రిమ వాతావరణంలో ఇమడటానికి ఇబ్బంది పడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ మీటింగ్‌కు వెళ్లినందుకు జరిమానాకు గురయ్యారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ, లా కోర్సులు చదివారు. ఆ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు నాగిరెడ్డి. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ మార్స్ గ్రోవర్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తే విద్యార్థి యూనియన్ తరపున నాగిరెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే వైస్ ఛాన్స్‌లర్‌గా వున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గాంధీజి సిఫారస్ మేరకే ఆయన్ను ఆహ్వానిస్తున్నామని చెప్పటంతో నాగిరెడ్డి మౌనం దాల్చారు. అయితే అనుకున్నట్లుగానే గ్రోవర్ రాజ్యాంగ సభకు వ్యతిరేకంగా అనేక అవాస్తవాలు మాట్లాడటంతో సభ ముగిసిన తర్వాత గ్రోవర్ ప్రసంగంపై ఒక కరపత్రం వేసి పంచారు. ఆ కరపత్రాన్ని గ్రోవర్‌కు పంపడమే కాకుండా ఆయన్ని సవాలు చేస్తూ ఒక ఉత్తరం కూడా నాగిరెడ్డి రాశారు. ఆ ఉత్తరాన్ని, కరపత్రాన్ని గాంధీకి గ్రోవర్ పంపాడు. దాంతో నాగిరెడ్డిని గ్రోవర్ కు క్షమాపణ చెప్పాలని కోరతూ సర్వేపల్లికి గాంధీ లేఖ రాశారు. అయితే గాంధీ డిమాండ్‌ను నాగిరెడ్డి తిరస్కరించారు. తన తిరస్కారానికి మనస్తాపం చెందింవుంటే క్షమించమని కోరుతూ గాంధీకి నాగిరెడ్డి మరో లేఖ రాశారు.
నాగిరెడ్డి 1952లో తన బావ నీలం సంజీవరెడ్డిపై పోటీ చేసి అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 62లో పుట్లూరు నుంచి, 67లో మళ్లీ అనంతపురం నుంచి శాసనసభకు ఎన్నిక కాగా, 57 నుంచి 62 వరకు అనంతపురం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
భిన్నభిప్రాయాన్ని ఇంతగా గౌరవించే మరో నాయకుడు- ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు. 1975 జూన్ 23న తాడిపర్తిలోను, జూన్ 25ప అనంతపురం పాతవూరిలోనూ జరిగిన బహిరంగ సభల్లో ఇందిరాగాంధి ఎమర్జెన్సీ వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతుందని ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. భవిష్యత్తును అంత స్పష్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న కమ్యూనిస్టు నాయకుడు ఆయన. 1976 జులై 28న అమరుడయ్యారు. ఆయన గొప్ప అధ్యయనశీలి, వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. మానవత్వం పరిమళించే మంచి మనిషి.