iDreamPost
android-app
ios-app

సీపీఎం తెలంగాణ కార్యదర్శిగా మూడోసారి తమ్మినేని

సీపీఎం తెలంగాణ కార్యదర్శిగా మూడోసారి తమ్మినేని

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర మ‌హాస‌భ‌లు రంగారెడ్డి జిల్లా తుర్క‌యాంజ‌ల్ లో ఆదివారం నుంచి జరుగుతున్నాయి. ముగింపు రోజున కొత్త క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ పేర్లు వినిపించాయి. అయితే, మ‌రోసారి తమ్మినేనికే పార్టీ పగ్గాలు లభించాయి.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అర‌వై మందితో కార్యవర్గం కూడా ఎన్నికైంది. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి కూడా త‌మ్మినేని వీర‌భ‌ద్రం సీపీఎం బ‌లోపేతంలో విశేషకృషి చేస్తున్నారు. మాస్ లీడర్ గా ప్ర‌జ‌ల్లో గుర్తింపు పొందారు. ప్రజా ఉద్యమాల రూప‌క‌ర్త‌గా గుర్తింపు పొందారు. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో జ‌న్మించారు. సాధారణ కార్యకర్తగా 1971లో సీపీఎంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు సీపీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. ఖమ్మం డివిజన్, జిల్లా యువజనోద్యమ నిర్మాణానికి తీవ్రంగా కృషి చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారు. 1985లో సీపీఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా , 1986లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1990లో జిల్లా తాత్కాలిక కార్యదర్శిగా.. అలాగే, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991లో పూర్తిస్థాయి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో 1996 వరకు కొనసాగారు. 1999లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికయ్యారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం, సమగ్రాభివృద్ధి కోసం వందరోజుల పాటు 2,662 కిలో మీటర్ల దూరం కాలిబాటన నడిచారు. ఈ పాదయాత్ర ఆయ‌న‌కు గుర్తింపు తెచ్చింది. అదేవిధంగా దళితుల అభివృద్ధికి కేవీపీఎస్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రతీ ఆదివారం మేధావులు, పార్టీ నాయకులతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేవారు. నిత్యం పార్టీ కార్య‌క్ర‌మాల‌లోనే త‌ల‌మున‌క‌లై ఉండేవారు.

1991లో మొదటిసారిగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 1996లో అదే స్థానం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2004లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో మూడు ప్ర‌ధాన పార్టీలు ఉండ‌గా, సీపీఎం నుంచి నిల‌బ‌డ్డ త‌మ్మినేని విజ‌యం సాధించి స‌త్తా చాటారు. నాలుగు పార్టీలు ఉండ‌గా.. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన చతుర్ముఖ పోటీలో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికై సత్తా చాటారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తేవారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఆయ‌నే కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతూ సీపీఎం ఉనికి చాటే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా మూడోసారి కూడా ఆయ‌నే ప‌గ్గాలు చేప‌ట్టారు.