iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? షూటింగ్ అని చెప్పి కారవాన్‌లో కూర్చుంటున్నారా?

  • Published Jun 10, 2022 | 7:17 PM Updated Updated Jun 10, 2022 | 7:17 PM
పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? షూటింగ్ అని చెప్పి కారవాన్‌లో కూర్చుంటున్నారా?

ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని సినిమాలని పాన్ ఇండియా సినిమాలంటూ భారీ బడ్జెట్ లతో తెరకెక్కిస్తున్నారు.దీనివల్ల బడ్జెట్ లు పెరుగుతున్నాయి, సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలి అని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలని పొగుడుతూ పలువురు కామెంట్లు చేస్తుంటే ప్రముఖ సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పాన్ ఇండియా సినిమాలని విమర్శిస్తూ ఓ వీడియో చేశారు.

తాజాగా మేజర్ సినిమా చూసిన తమ్మారెడ్డి భరద్వాజ ఆ సినిమాని ప్రశంసిస్తూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. ఆ వీడియోలో మేజర్ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమాల గురించి కూడా మాట్లాడారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..”నిన్ననే నేను మేజర్‌ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా యాక్ట్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, పాన్‌ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్‌ పాన్‌ ఇండియా కథ.

కొంతమంది ఇటీవల మాది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, బడ్జెట్‌ భారీగా అయ్యింది, లాస్‌లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేలా చూడండి అని ముఖ్యమంత్రులను కోరడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి ఎన్నో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు మేజర్‌ ఏమాత్రం తీసిపోదు. టెక్నికల్‌, క్వాలిటీపరంగా సినిమా బాగుంది. ఈ చిత్రాన్ని రూ.25కోట్లలోపే పూర్తి చేస్తే మిగతా ప్రాజెక్ట్‌లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ‘మేజర్‌’ లాంటి చిత్రానికి ఖర్చు కానిది మీకు ఎందుకు అవుతుంది? అనేది ఆలోచించుకోవాలి. షూటింగ్‌ అని చెప్పి క్యారవాన్‌లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్‌తో చేయాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి అని సీరియస్ గా మాట్లాడారు. మరి తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలని ఎవరైనా సీరియస్ గా తీసుకొని స్పందిస్తారేమో చూడాలి.