iDreamPost
iDreamPost
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్బంగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రసంగానికి తమిళనాడు సి.యం పళని స్వామి ధన్యవాదాలు తెలుపుతూ తీవ్ర కరువు పరిస్తితులు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రజల గోడు అర్ధం చేసుకుని సకాలంలో తెలుగు గంగ నీరిచ్చి ఆదుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి వై.యస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. గత ఆగస్టు నెలలో నా ఆదేశాల మేరకు మంత్రుల బృందం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసి 90 లక్షల మంది చెన్నై ప్రజలు కరువు నేపథ్యంలో త్రాగు నీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, తెలుగు గంగ పథకం కింద తమిళనాడుకు కేటాయించిన నీటిని విడుదల చేయవల్సిందిగా కోరామని దానికి ప్రతిగా జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మా కోర్కెను మన్నించి సకాలంలో నీటిని విడుదల చేసి తమిళనాడు ప్రజల దాహార్తి తీర్చారని, దీనికి జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పళని స్వామి తన ప్రసంగంలో పేర్కొన్నారు. గోదావరి కావేరి నదుల అనుసంధానం కోసం తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహించి సాధ్యమైనంత త్వరగా వారి అంగీకారాలను పొందాలని ప్రధాని మోడి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.