Idream media
Idream media
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతోన్న వివాదానికి పరిష్కారమే లక్ష్యంగా ఇరు దేశాలు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలను శనివారం ప్రారంభించాయి.నిన్న శుక్రవారం ఇరు దేశాల మధ్య ఉన్న స్వల్ప విభేదాలు ఘర్షణలకు దారి తీయకుండా శాంతియుతంగా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలో తూర్పు లడఖ్ చూశాల్‌లోని మోల్దోని బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద జరుగుతున్న సమావేశానికి మన దేశం తరఫున లేహ్ 14 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా సైన్యం నుంచి టిబెట్ మిలటరీ రీజియన్ కమాండర్ హాజరయ్యారు.
నేటి సమావేశంలో 2018లో చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలు ఉండాలని నిర్ణయించారు.గతంలో ఇరు దేశాల నాయకత్వం అందించిన మార్గదర్శకాల ద్వారా సరిహద్దు విభేదాలు పరిష్కరించుకోవడానికి ఇరువర్గాలు అంగీకరించాయి.ఇక పాంగాంగ్ సో, గాల్వన్ లోయ నుంచి చైనా సైన్యం వైదొలగాలని, మన భూభాగాలలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ నిర్మించిన తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సిందేనని భారత్,చైనాకు స్పష్టం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య,సైనికపరమైన చర్చలు కొనసాగుతున్నాయని భారత సైన్యానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.అలాగే ఈ దశలో చర్చల సారాంశం గురించి ఊహాజనిత మరియు ఆధారంలేని రిపోర్టింగ్‌కు దూరంగా ఉండాలని భారత సైన్యం మీడియాకు సూచించింది.
ఇక గత మే మొదటివారంలో లడక్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ముఖాముఖి ముష్టి యుద్ధానికి పాల్పడ్డారు. దీంతో భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తత నెలకొని మరో సందర్భంలో కూడా ఇరు పక్షాల సైనికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.సమస్య పరిష్కారానికి నాటి నుంచి ఇరు దేశాలకు చెందిన స్థానిక కమాండర్ స్థాయి అధికారుల మధ్య 12 సార్లు,మేజర్ జనరల్ స్థాయి అధికారులు మధ్య మూడు సార్లు చర్చలు జరిగాయి.కానీ అవి ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో నేడు లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.