శ్రీవారి భక్తులకు శుభవార్త

ప్రపంచం నలుమూలలా ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. స్వామి వారిని ఏడాదిలో ఒకసారైనా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆశిస్తాడు. దేశ విదేశాల్లో ఉన్న స్వామి వారి భక్తులకు ఆ అవకాశం లభించకపోయినా శ్రీవారి నిత్య కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్‌వీబీసీ) ద్వారా వీక్షిస్తూ తన్మయత్వం పొందుతున్నారు.

ప్రస్తుతం ఎస్‌వీబీసీ ఛానెల్‌లో స్వామి వారి కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలన్నీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనే ప్రసారం చేస్తున్నారు. ఇకపై జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్‌లో కూడా ఎస్‌వీబీసీలో కార్యక్రమాలు ప్రసారం చేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు సోమవారం వెల్లడించారు. అలిపిరిలో సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎస్‌వీబీసీ ఛానెల్‌ భవనాన్ని ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఈ విషయం వెల్లడించారు.

హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ ఎస్‌వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయడం వల్ల భక్తులకు శ్రీవారు మరింత దగ్గరకానున్నారు. ఉత్తర భారత దేశంలో వివిధ భాషలు ఉన్నా.. అధిక శాతం మంది హందీనే మాట్లాడతారు. రాజస్థానీ, పంజాబీ తదితర భాషలు మాట్లాడే వారికి కూడా హిందీ తెలుసు. అలాగే ఇంగ్లీష్‌ భాషలో కార్యక్రమాలు ప్రసారం చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిద దేశాల భక్తులు స్వామి నిత్య కైంకర్యాలు వీక్షిస్తారు. ప్రస్తుతం ఎస్‌వీబీసీ ఛానెల్‌ను ఏడు కోట్ల మంది వీక్షిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. హిందీ, ఇంగ్లీష్‌లోనూ కార్యక్రమాలు ప్రసారం చేస్తే.. ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

Show comments