iDreamPost
iDreamPost
ఇంటి పనిమనిషిని తీవ్రంగా హింసించారన్న ఆరోపణలపై జార్ఖండ్‌లోని సస్పెండ్ అయిన బీజేపీ నేత సీమ పాత్రను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె బీజేపీ మహిళా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యురాలుకూడా. సీమా పాత్ర కొడుకు 29 ఏళ్ల పనిమనిషిని తన అమ్మ నుంచి రక్షించమని స్నేహితుడిని కోరడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ నేత బిజెపి “బేటీ బచావో బేటీ పఢావో” ప్రచారానికి మాజీ జార్ఖండ్ అధిపతి. దాదాపు పదేళ్లుగా ఈ రాజకీయ నేత కోసం ఇంటిదగ్గర పనిచేస్తోంది సునీత. ఆమె వయస్సు 29 ఏళ్లు. ఆమెను వేధించారు, కొట్టారు. దెబ్బలకు తాళలేక ఇంటికి వెళ్లిపోతానంటే, గదిలో వేసి బంధించారు. కొట్టినా గట్టిగా ఏడవకూడదు. ఆమె నుంచి శబ్ధం వచ్చిందంటే మరింతగా కొట్టేదని, క్రూరంగా హింసించిందని సీమా పాత్రపై పోలీసులు కేసు పెట్టారుSeema Patra
సునీతను రాడ్‌లతో కొట్టడంతో పాటు పళ్లు కూడా విరిగాయని అధికారులు చెప్పారు. ఆమెను బైటకు వెళ్లకుండా, గదిలో బలవంతంగా నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ హింసను చూడలేక ఆమె కొడుకు చాలాసార్లు ఎదురుతిరిగాడు. మానసికంగా దెబ్బతిన్నాడు. అయినా ఆమె ఆగలేదు. చివరకు, పనిమనిషికి సహాయం చేయమని ఫ్రెండ్ ని కోరడంతో ఇదికాస్తా అధికారుల దృష్టికి వచ్చింది
కస్టడీలోకి తీసుకున్నప్పుడు, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చేసినవని, అవన్నీ తప్పుడు ఆరోపణలని పాత్రా అంటున్నారు. ఆమెను సెప్టెంబర్ 12 వరకు పోలీసు రిమాండ్‌కు తరలించారు.
జాతీయ స్థాయిలో ఈ దుర్మార్గం తెలియడంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బియాస్ తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా ఆమెను అరెస్టు చేయాలని కోరింది. ఈ వేధింపులు “అత్యంత ఆందోళనకరమైనది” “అవమానకరం” అని కామెంట్ చేసింది. వారంలో నివేదిక ఇవ్వాలన్నది పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశం. బాధితురాలికి మంచి వైద్యం అందించాలని, భద్రమైన పునరావాసం కల్పించాలని కమిషన్ కోరింది. సునీతా కుమారిని పోలీసులు రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మెజిస్ట్రేట్ ఎదుట తన వాంగ్మూలమిచ్చింది. ఆమె నెమ్మదిగా కోలుకొంటోంది.
నిందితులపై సెక్షన్లు 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), 325 (తీవ్రంగా గాయపరచడం), 349 (బలాన్ని ఉపయోగించడం), మరియు SC/ST అట్రాసిటీ చట్టం సెక్షన్ 1(ఎ), (హెచ్) కింద కేసును నమోదు చేశారు.