iDreamPost
android-app
ios-app

సురేష్ బాబు వ్యూహాత్మక మౌనం

  • Published Sep 05, 2021 | 5:04 AM Updated Updated Sep 05, 2021 | 5:04 AM
సురేష్ బాబు వ్యూహాత్మక మౌనం

థియేటర్లు తెరుచుకున్నాక కూడా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ విషయంలో ముందువెనుకా ఆడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. జనం కుటుంబాలతో సహా హాళ్లకు పూర్తిగా వచ్చే రోజులు ఎప్పుడు వస్తాయాని ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం, సెకండ్ షోల రద్దు లాంటి పరిణామాలు ఇంకాస్త పెద్ద బ్రేక్ ని వేస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా ఏదో ఒక అప్ డేట్ అయితే ప్రొడక్షన్ సంస్థలు రెగ్యులర్ గా ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాయి. అయితే దృశ్యం 2, విరాట పర్వంలు మాత్రం ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలోనూ చిన్న అప్ డేట్ కూడా లేదు.

నారప్ప ఓటిటి విడుదలకు సంబంధించి నిర్మాత సురేష్ బాబు విమర్శలు ఎదురుకున్న తరుణంలో అప్పటి నుంచి వాతావరణం అంతో ఇంతో వేడిగా ఉంది. టక్ జగదీష్ కూడా అదే బాట పట్టడంతో ఇది కాస్తా పీక్స్ కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో దృశ్యం 2, విరాట పర్వంలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో బయటికి రావడం లేదు. ఒకవేళ డిజిటల్ రిలీజ్ అనుకుంటే మాత్రం ఇప్పుడప్పుడే ప్రకటన చేయరు. థర్డ్ వేవ్ మెల్లగా కేరళలో ఊపందుకుంటోంది. జనంలో మరోసారి భయాలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిస్థితి మళ్ళీ పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు అవ్వొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

అందుకే దృశ్యం 2, విరాట పర్వం రెండింటిలోనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సురేష్ బాబు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని వినికిడి. ఇంకొద్దిరోజులు వేచి చూసి ఒకవేళ అప్పటికీ సిచువేషన్ లో ఎలాంటి మార్పు లేకపోతే అప్పుడు ఏ రూపంలో విడుదల చేసినా తప్పుబట్టడానికి ఉండదని ఆలోచిస్తున్నారట. దృశ్యం 2 ఆల్రెడీ ఎప్పుడో పూర్తయ్యింది. విరాట పర్వం చిన్న చిన్న ప్యాచ్ వర్కులు తప్ప అదీ ఫినిషింగ్ స్టేజి లోనే ఉంది. రెండు విభిన్నమైన జానర్లకు సంబంధించిన ఈ సినిమాల మీద దగ్గుబాటి అభిమానుల అంచనాలు మాములుగా లేవు. కనీసం అక్టోబర్ లో అయినా దీని తాలూకు ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలి

Also Read : మాస్ దర్శకులతో అదిరిపోయే లైనప్