iDreamPost
iDreamPost
మహ్మద్ ప్రవక్తపై వాఖ్యలతో తీవ్ర దుమారం రేపిన బీజేపీ నేత నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలన్న నూపూర్ పిటిషన్ ను కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారం ఉందనే పొగరుతో నూపుర్ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, దేశాన్నే తగలబెట్టారని మండిపడింది.
“ఆమె బెదిరింపులను ఎదుర్కొంటుందా? లేదంటే ఆమే దేశానికి భద్రతా ముప్పుగా పరిణమించిందా? దేశంలో ఇప్పుడు జరుగుతున్నదానికి ఆమె ఒక్కరే బాధ్యత వహించాలి” అని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు. ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ సమయంలో ప్రయాణాలు సురక్షితం కాదన్న నుపూర్ శర్మ తరపు న్యాయవాది వాదనకు, న్యాయమూర్తి సమాధానమిచ్చారు.
“ఆమెను చర్చలో ఎలా రెచ్చగొట్టారో మనం చూశాం. కానీ ఆమె మాట్లాడింది, ఆ తరువాత ఆమె తాను లాయర్ అని చెప్పడం సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి” అని అన్నారు. ఢిల్లీ పోలీసులను, డిబేట్‌ను నిర్వహిస్తున్న టీవీ ఛానల్‌ను ఎత్తిచూపిన సుప్రీం “ఢిల్లీ పోలీసులు ఏం చేశారు? టీవీ చర్చ దేనికి సంబంధించింది? వాళ్ల ఎజెండాకు ఆజ్యం పోయడానికా? కోర్టు పరిధిలోని టాపిక్ ను ఎందుకు ఎంచుకున్నారు?”
ఈ కేసులో పోలీసులను తప్పుపట్టిన కోర్టు “ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పుడు, వెంటనే వాళ్లను అరెస్టు చేస్తారు, కానీ అదే ఆమె మీద అయితే మాత్రం, తాకడానికి ఎవరూ సాహసించరు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
నూపూర్ శర్మను మరింతగా విమర్శించిన సుప్రీం ఆమె మొండితనం, అహంకార స్వభావాన్ని చూపించారని వ్యాఖ్యానించింది. “ఆమె ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే ఏంటి? తనకు అధికారం ఉందికదాని, దేశంలోని చట్టాన్ని గౌరవించకుండా ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకొంటున్నారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.