Idream media
Idream media
సుపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తలైవా రాజకీయారంగేట్రం ఖాయమైంది. రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు. ఈ నెల 31వ తేదీన పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. 2021లో జరగబోయే తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.
రజనీ మక్కళ్ మాండ్రం పేరుతో తన అభిమానులను ఏకతాటిపైకి తెచ్చిన రజనీకాంత్.. పలుమార్లు వారితో పార్టీ ఏర్పాటుపై చర్చించారు. కొన్నేళ్లుగా రజనీ రాజకీయ పార్టీ వ్యవహారం తమిళనాడుతో సహా జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. గత సోమవారం కూడా రజనీ మక్కళ్ మాండ్రం నిర్వాహకులతో రజనీ సమావేశం అయ్యారు. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటన చేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే పది రోజుల వ్యవధిలో రజనీ పార్టీ ప్రకటన చేశారు.
ఈ రోజు ట్విట్టర్ ద్వారా పార్టీ ఏర్పాటు విషయం వెల్లడించిన రజనీకాంత్.. ఆ తర్వాత కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చారు. ‘‘ తమిళనాడు రాజకీయాలను మార్చాల్సిన సమయం వచ్చింది. మార్పు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు. ఏదైనా ప్రజలపైనే ఆధారపడి ఉంది. నా ప్రణాళిక కరోనా వల్ల ఆలస్యమైంది. మార్పు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. ప్రజల కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. నేను గెలిస్తే.. అది ప్రజా విజయం. రాష్ట్రంలో నిజాయతీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి’’ అంటూ రజనీ ట్విట్టర్‌లోనూ, మీడియా సమావేశంలోనూ పేర్కొన్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొన్నేళ్లుగా ప్రచారం సాగుతున్నా.. జయలలిత మరణం తర్వాత ఈ ప్రచారం గట్టిగా సాగింది. తమిళనాడులో స్థానిక పార్టీలతే ఆధిపత్యం. డీఎంకే, ఏఐడీఎంకేలు తమిళనాడులో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి తమిళనాడులో ప్రభుత్వం మారే విధానానికి ఏఐడీఎంకే చీఫ్ జయలళిత 2016 ఎన్నికల్లో స్వస్తి పలికారు. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు. అయితే ఏడాది లోపే ఆమె అనారోగ్యం వల్ల చనిపోయారు. అనూహ్య పరిస్థితులలో జయలలిత నిచ్చెలి శశికళ జైలుపాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఏఐడీఎంకేలో చీలిక వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులో పాగా వేసేందుకు వేచిచూస్తోంది. ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నించినట్లు ప్రచారం సాగింది. రజనీకాంత్‌ను పార్టీలో చేర్చుకుని తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నాలను నిన్నమొన్నటి వరకు సాగించింది. వచ్చే ఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు మారో ఆరు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో పార్టీ ఏర్పాటు, ఎన్నికలలో పోటీపై రజనీకాంత్ చేసిన ప్రకటన ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.