iDreamPost
android-app
ios-app

Super Machi : సూపర్ మచ్చి రిపోర్ట్

  • Published Jan 17, 2022 | 5:00 AM Updated Updated Jan 17, 2022 | 5:00 AM
Super Machi  :  సూపర్ మచ్చి రిపోర్ట్

సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి ఉందన్న సంగతి ప్రేక్షకులకు తెలియనంత వీక్ గా ప్రమోషన్ చేసిన యూనిట్ ఫలితాన్ని కూడా దానికి తగ్గట్టే అందుకుంది. చాలా చోట్ల మొదటి రోజే కనీస స్థాయిలో జనం లేక షోలు రద్దు చేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న కొన్ని కేంద్రాల్లో దాని స్థానంలో బంగార్రాజు షోలు వేయడం మరో ట్విస్ట్. మెగా కాంపౌండ్ నుంచి కనీస మద్దతు లేకపోవడంతో పాటు హీరో హీరోయిన్ యూనిట్ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు కూడా రాకపోవడం దెబ్బ కొట్టింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

నెలకు లక్షా డెబ్భై ఐదు వేల జీతంతో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే మీనాక్షి(రచిత రామ్) అసలు మొహమే తెలియని రాజు(కళ్యాణ్ దేవ్)ని ప్రేమిస్తూ ఉంటుంది. అతగాడిది బీచ్ సైడ్ మాస్ బార్ లో పాటలు పాడే ఉద్యోగం. రాజు ఛీ కొడుతున్నా మీనాక్షి ప్రేమంటూ వెంటపడుతూ ఉంటుంది. ఆఖరికి తనతో పడుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అసలు మీనాక్షి ఇలా ఎందుకు ప్రవరిస్తోందని ఆరా తీసిన రాజుకి ఆమె తండ్రి(రాజేంద్రప్రసాద్)కు తనకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి తెలుస్తుంది. దీంతో కళ్ళు తెరుచుకుని తనకోసం వచ్చిన మీనాక్షిని అక్కున చేర్చుకుని తెరమీద శుభం కార్డు వేయించి మనతో హమ్మయ్య అనిపిస్తాడు.

టీవీ సీరియల్ ని తెరమీద చూపిస్తే భరించలేం. సూపర్ మచ్చిలో అచ్చంగా జరిగింది ఇదే. ఫస్ట్ హాఫ్ మొత్తం మీనాక్షి రాజు వెనుక పడటాన్ని ఇరిటేట్ అయ్యే స్థాయిలో చూపించిన దర్శకుడు పులి వాసు సెకండ్ హాఫ్లో దానికి సరైన రీజన్ ని ఎస్టాబ్లిష్ చేయలేక సిల్లీగా డిజైన్ చేయడంతో సినిమా మొత్తం తట్టుకోలేని ప్రహసనంగా మారిపోయింది. నరేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి, అజయ్ లాంటి క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కథా కథనాలు మరీ జీరో స్థాయిలో ఉండటంతో వాళ్ళు ఎమోషనల్ గా చేసిన సీన్స్ సైతం చిరాకు పుట్టిస్తాయి. తమన్ కూడా హెల్ప్ లెస్ అయ్యాడు. ఓటిటిలోనే వామ్మో అనిపించే ఈ కళాఖండం థియేటర్లో చివరిదాకా చూసినవాళ్లకు వీరతాడు వేయాల్సిందే

Also Read : Pooja Hegde : పూజా అభిమానులకు వరస కానుకలు