iDreamPost
iDreamPost
ఈ నెల 26న అరణ్య విడుదల కోసం ఎదురు చూస్తున్న దగ్గుబాటి రానా ఇదే ఏడాది విరాటపర్వం తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా కనిపించనున్నాడు. దీనికి బిల్లా రంగా అనే టైటిల్ గట్టి ప్రచారంలో ఉంది. నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ మహానాయకుడు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రానా ఇకపై సినిమాలు వేగంగా చేయబోతున్నాడు. బడ్జెట్ కారణాల వల్ల హిరణ్యకసిప వాయిదా పడటంతో ఆలోగా కొత్త ప్రాజెక్టులను రెడీ చేస్తున్నాడు. కొత్త పాత తేడా లేకుండా కథ నచ్చితే చాలు సెట్స్ పైకి వెళదామని చెప్పేస్తున్నాడు. మరోవైపు టీవీ షోలు, వెబ్ సిరీస్ ప్లానింగులు ఇలా రానా డైరీ రాబోయే రోజుల్లో చాలా బిజీగా ఉండనుంది.
ఇదిలా ఉండగా రానా రీసెంట్ గా వెంకీ అనే డెబ్యూ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్టుగా తెలిసింది. ఇతను సుకుమార్ శిష్యుడు. చాలా ఏళ్ళు పనిచేశాక స్వంతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వినిపిస్తే రానాకు నచ్చిందట. ఇది 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించబోతున్నారని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ఇన్ సైడ్ టాక్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, ఈ వెంకీ ఇద్దరూ సుకుమార్ వద్ద ఒకే టీమ్ లో పనిచేశారు. వీళ్ళ మీద నమ్మకం కుదిరాక సుక్కు స్వయంగా పెద్ద ప్రొడక్షన్ హౌసులకు వాళ్ళను రిఫర్ చేస్తున్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ సక్సెస్ లో దీన్ని కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
షూటింగ్ వచ్చే వేసవిలోగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కథ ఏ జానర్ లాంటి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇటీవలే అరణ్య ట్రైలర్ తో ఆకట్టుకున్న రానా దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అడవి నేపథ్యంలో ఏనుగులను కాపాడుకోవాలనే సందేశంతో రూపొందిన ఈ జంగిల్ ఎంటర్ టైనర్ భారీ బడ్జెట్ తో రూపొందింది. పాన్ ఇండియా లెవెల్ లో మల్టీ లాంగ్వేజ్ లో రూపొందిన మూవీ కాబట్టి ఘాజీ తరహాలో తనకు మరోసారి పేరు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు రానా. మొత్తంగా 2021లో రానా మూడు సినిమాల్లో కనిపించడం కంటే విశేషం ఏముంటుంది.