iDreamPost
iDreamPost
ఒక సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే దాన్ని ఏ టైంలో రిలీజ్ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఈ క్యాలికులేషన్ లో ఏ మాత్రం లెక్క తప్పినా బాక్సాఫీసు వద్ద తేడా కొట్టేస్తుంది. సుధీర్ బాబు హంట్ కి ఈ సమస్యే వచ్చింది. షారుఖ్ ఖాన్ పఠాన్ కంటే ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన నిర్మాతలకు దాని బ్లాక్ బస్టర్ టాక్ హంట్ ఓపెనింగ్స్ మీద పెద్ద దెబ్బే కొట్టింది. యాక్షన్ గ్రాండియర్ ని చూడాలన్నా ఉత్సాహం ఒక క్రైమ్ థ్రిల్లర్ కు రాలేదు. ఎంత మహేష్ సపోర్ట్ ఉన్నా, కృష్ణ అల్లుడి బ్రాండ్ ఉన్నా, సుధీర్ బాబు కోసం ఆ ఇద్దరి ఫ్యాన్స్ మొదటిరోజే థియేటర్లకు రావడం లేదు. వాళ్లంతా కదిలితే ఈజీగా ఫుల్స్ పడతాయి.
కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతోంది వేరు. చాలా చోట్ల హంట్ కి సగం ఆక్యుపెన్సీలు నమోదు కాలేదు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో పరిస్థితి సోసోగానే ఉంది. పైగా ప్రమోషన్లు ఉదృతంగా చేయకపోవడంతో కామన్ పబ్లిక్ కి రిలీజ్ విషయం పూర్తిగా చేరలేదు. దానికి తోడు టాక్ డివైడ్ గా రావడం సుధీర్ బాబు ఏ మేరకు కాచుకుంటాడో చూడాలి. అనూహ్యంగా వాల్తేరు వీరయ్య వీకెండ్ బుకింగ్స్ ఊపందుకోగా బాగా నెమ్మదించిన వీరసింహారెడ్డికి మళ్ళీ పికప్ కనిపిస్తోంది. జనవరి మొత్తం ఎంటర్ టైనర్ల సీజన్ నడుస్తున్న తరుణంలో హంట్ లాంటి సీరియస్ డ్రామా వైపు పబ్లిక్ పెద్దగా దృష్టి సారించడం లేదు. పైగా శ్రీకాంత్ భరత్ లాంటి క్యాస్టింగ్ సైతం జనాన్ని ఆకర్షించలేదు
ఇవన్నీ సుధీర్ రాబోయే రోజుల్లో విశ్లేషించుకోవాలి. నిర్మాణంలో ఉన్న రెండు సినిమాల్లో ఒక ప్యాన్ ఇండియా (హారొం హర) ఉంది. వరసగా చేసుకుంటూ పోవడం బాగానే ఉంది కానీ హిట్లు పడ్డప్పుడే కెరీర్ గ్రాఫ్ వేగంగా ఎగబాకుతుంది. స్వంతంగా ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంటే తప్ప నెగ్గుకురావడం కష్టమని తనకూ అర్థమవుతోంది. అలాంటప్పుడు విడుదల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి డేట్లు డిసైడ్ చేసుకోవాలి. మీడియం రేంజ్ హీరోలు బడా స్టార్లతో తక్కువ గ్యాప్ లో తలపడటం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. హంట్ ఫేట్ ఇప్పటికే తేలిపోయినా ఈ వీకెండ్ మూడు రోజులు ఏమైనా గట్టెక్కిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చు