iDreamPost
android-app
ios-app

బద్వేల్ ఉప ఎన్నిక : వైసీపీ అభ్యర్థి ఖరారు

బద్వేల్ ఉప ఎన్నిక : వైసీపీ అభ్యర్థి ఖరారు

ఒకపక్క తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉప ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా బద్వేల్ స్థానానికి ఉప ఎన్నికల రంగం సిద్ధమైంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ అ ఉప ఎన్నిక అనివార్యం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీన బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అక్టోబర్ 8 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కాగా అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన అలాగే అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ గా ఉండనుంది. అక్టోబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 2వ తేదీన జరగనుంది అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించనున్నారు.

అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది దాని మీద అనేక చర్చోప చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే ముందు నుంచి కూడా వెంకటసుబ్బయ్య భార్య సుధకు టికెట్ లభించవచ్చని అందరూ భావిస్తూ రాగా చివరికి దానిని నిజం చేస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే చనిపోయిన స్థానంలో పోటీ పెట్టకపోవడం సంప్రదాయంగా వస్తుందని ఒకవేళ పోటీ పెడితే కనుక కచ్చితంగా తామే గెలుస్తామని అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆ సంప్రదాయం ఉండేది కానీ ఇప్పుడు ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చనిపోయినా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు బరిలో దిగుతూనే ఉన్నారు. ఇక బద్వేల్ స్థానానికి సంబంధించి టిడిపి అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బీజేపీ- జనసేనలు కూడా ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడగా బద్వేలు ఉప ఎన్నికల విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అయితే వైసీపీ ఈ స్థానాన్ని రెండు సార్లు కైవసం చేసుకుంది. 2014లో తిరువీధి జయరాములు వైసీపీ తరఫున ఎమ్మెల్యే గా ఎన్నిక కాగా ఆ తరువాత కొద్ది రోజులకే చంద్రబాబు ప్రలోభాల పర్వంలో పడి పార్టీ మారారు. ఆ తర్వాత జగన్ ఇక్కడ వెంకటసుబ్బయ్యకి టికెట్ కేటాయించగా ఆయన గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో వెంకటసుబ్బయ్య కొద్ది రోజుల క్రితం మరణించారు. 2019 ఎన్నికల్లో ఓబులాపురం రాజశేఖర్ మీద దాదాపు 44 వేల మెజారిటీతో వెంకటసుబ్బయ్య గెలిచారు. ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అప్పట్లోనే హామీ ఇచ్చిన జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన భార్యకు టికెట్ కేటాయించారు.