iDreamPost
android-app
ios-app

Subhash Chandra Bose : పరాజయం పాలైన ఫ్రీడమ్ ఫైటర్ – Nostalgia

  • Published Nov 08, 2021 | 11:44 AM Updated Updated Nov 08, 2021 | 11:44 AM
Subhash Chandra Bose : పరాజయం పాలైన ఫ్రీడమ్ ఫైటర్ – Nostalgia

1996లో కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం చూశాక ఇతర స్టార్ హీరోలకూ తాము కూడా అలాంటి క్యారెక్టర్స్ చేసి అభిమానులను మెప్పించాలన్న కోరిక కలిగింది. ఫ్రీడమ్ ఫైటర్ అంటే అల్లూరి సీతారామరాజులా అప్పటి కథను మాత్రమే కాకుండా వర్తమానాన్ని కూడా జోడించి ఎలా మేజిక్ చేయవచ్చో శంకర్ చూపించడంతో దర్శక రచయితలు ఆ దిశగా కథలు అల్లడం మొదలుపెట్టారు. అలా వచ్చిందే వెంకటేష్ సుభాష్ చంద్ర బోస్. 2004లో ప్రసిద్ధ వైజయంతి బ్యానర్ మీద వెంకటేష్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు నిర్మాత సి అశ్వనీదత్. ఆ కాంబోలో అంతకు ముందు బ్రహ్మరుద్రులు వచ్చింది.

కానీ అది ఆశించిన విజయం సాధించలేదు. చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్లు కొట్టిన దత్తు గారికి వెంకీతోనూ ఆ లోటు తీర్చుకోవాలన్న కోరిక ఉంది. తన సంస్థ గ్రాండియర్ కు ఏ మాత్రం తగ్గకుండా సత్యానంద్ ఇచ్చిన కథకు ఓకే చేశారు. అప్పటికే దత్తుగారి బ్యానర్లో అగ్నిపర్వతం, జగదేకేవీరుడు అతిలోకసుందరి, ఆఖరి పోరాటం లాంటి హిట్లను ఇచ్చిన కె రాఘవేంద్రరావు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు తెగించిన సుభాష్ చంద్ర బోస్ అనే యువకుడిని బ్రిటిషర్లతో చేతులు కలిపి ఓ దేశద్రోహి అతని చావుకు కారణం అవుతాడు. తిరిగి కొన్నేళ్ల తర్వాత బోసు బిడ్డే ప్రతీకారం తీర్చుకుంటాడు.

అప్పటికే రాజకీయ నాయకుడిగా శక్తివంతమైన స్థానంలో ఉన్న ఆ ద్రోహిని ముప్పతిప్పలు పెట్టి తన తండ్రి దగ్గరికే పంపిస్తాడు. ఇది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ పాయింట్. ఈ స్క్రిప్ట్ కి సంభాషణలు అందించింది పరుచూరి సోదరులు. మణిశర్మ సంగీతం సమకూర్చగా జెనీలియా, శ్రేయ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్. గుల్షన్ గ్రోవర్, కోట, ఆలీ, రజా మురాద్, బ్రహ్మానందం తదితరులు ఇతర తారాగణం. 2005 ఏప్రిల్ 22 విడుదలైన సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ అయ్యింది. రెండు పాత్రల్లో వెంకీ అభినయం బాగున్నా కథాకథనాలు కనీస స్థాయిలో లేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఇంచుమించు ఇదే కథతో రియల్ స్టార్ శ్రీహరి హనుమంతు చేశారు. అది 2006లో రిలీజై కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ గా నిలవడం కొసమెరుపు.

Also Read : Simhasanam : కృష్ణ సాహసానికి నిదర్శనం ‘సింహాసనం’ – Nostalgia