iDreamPost
android-app
ios-app

పాఠశాలలో పాముకాటుకు గురైన 8వ తరగతి విద్యార్థి!

పాఠశాలలో పాముకాటుకు గురైన 8వ తరగతి విద్యార్థి!

ప్రమాదం అనేది ఎప్పుడు, ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవ్వరం చెప్పలేము. అప్పటి వరకు సంతోషంగా మనతో గడిపిన వ్యక్తులు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్తుంటారు. మరికొందరు తృటిలో మృత్యు ఒడి నుంచి జారుకుని ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణంలో ఉన్న బూటులోకి దూరిన పాము.. అది వేసుకున్న విద్యార్థిని కాటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కోనాపురం గ్రామానికి చెందిన హరినాథ్  అనే బాలుడు నగరూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి  పాఠశాలకు త్వరగా వచ్చి.. తన హోమ్ వర్క్ ను రాసుకుంటూ ఉండే వాడు. అలానే గురువారం ఉదయం 8 గంటలకు హరినాథ్ పాఠశాలకు చేరుకున్నాడు. ఆవరణంలో బూట్లు వదిలి.. తన హోం వర్క్ చేసుకున్నాడు. ఇంతలోనే  ప్రార్ధన బెల్ మోగడంతో హడావుడిగా  షూలు ధరించాడు. ఇంతలో తన కాలుకు ఏదో కుట్టిందంటూ హరినాథ్ గట్టిగా అరిచాడు. దీంతో పక్కనే ఉన్న పీడీ మహబూబ్ బాషా పక్కకు తీసుకెళ్లి బూట్లు విప్పించి చూడగా.. లోపలి నుంచి  ఓ పాము బయటకు వచ్చింది.

వెంటనే పామును చంపేసి.. పాము కాటుకు గురైన విద్యార్థిని తన బైక్ పై తాడిపత్రిలోని ప్రభుత్వ ఆస్పత్రికి పీడీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాలుడిని పరామర్శించారు.  అలానే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. సకాలంలో విద్యార్థిని ఆస్పత్రికి తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న పీడీ మహబూబ్ బాషాను ఎమ్మెల్యే అభినందించారు. అలానే స్థానికులు కూడా పీడీపై ప్రశంసలు కురిపించారు. మరి.. పాము కాటు కారణంగా చనిపోయి విద్యార్థులు ఎందరో ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల షూలు, స్కూల్ బ్యాగులు తరచూ చెక్ చేస్తూ ఉండాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.