iDreamPost
iDreamPost
జనంలో చైతన్యం రగిలించే సినిమాలు తీసే పీపుల్స్ స్టార్ గా ఆర్ నారాయణమూర్తి మనకు పరిచయం కానీ ఆయన కెరీర్ ప్రారంభంలో పడిన ఒడిదుడుకులు తెలిసింది కొందరికే. చిన్న చిన్న వేషాలతో ఇండస్ట్రీలో మనుగడ కోసం విపరీతంగా కష్టపడుతున్న సమయంలో గురువు దాసరి నారాయణరావు గారితో పరిచయం ఈయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో నారాయణమూర్తిని సోలో హీరోగా మార్చింది దాసరి గారే. 1981లో ‘సంగీత’ అనే సినిమా ద్వారా ఆ అవకాశం కలిగింది. ఇందులో కాయకష్టం చేసుకునే తిండిపోతైన పనివాడిగా నారాయణ మూర్తి పాత్ర చాలా హృద్యంగా ఉంటుంది.
ముందు ఈ కథ అనుకున్నప్పుడు హీరోయిన్ కోసం చాలా ఆప్షన్స్ అనుకున్నారు. త్యాగపూరితంగా ఉండటంతో పాటు చాలా ఎమోషన్ ని డిమాండ్ చేసే రోల్ అది. సూపర్ స్టార్ కృష్ణ సలహాతో అప్పుడే టీనేజ్ లో అడుగు పెట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ సుమతిని దీని ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం సంగీతం సమకూర్చడం విశేషం. శృంగార తార సిల్క్ స్మిత మొదటి సినిమా కూడా ఇదే. కథ చాలా సెంటిమెంట్ తో కూడుకుని ఉంటుంది. తల్లి చనిపోయి తండ్రి పక్షవాతానికి గురై అన్నయ్యలిద్దరూ ఇల్లు వదిలి పారిపోతే భారాన్ని నెత్తిమీద వేసుకున్న సంగీత తనకు అనుబంధాన్ని ఆత్మీయతను రుచి చూపించిన పనివాడితో జీవితాన్ని పంచుకుంటుంది. క్లైమాక్స్ లో కూతురు కన్నతండ్రికి కొరివి పెట్టడం అప్పట్లో ఓ సంచలనం.
సాంప్రదాయవాదులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసినా దాసరి గారు లెక్క చేయకుండా ధైర్యంగా తీశారు. ఈ కథ పేపర్లో వచ్చిన ఓ వార్త ఆధారంగా రాసుకున్నానని దర్శకరత్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించలేదు కానీ అందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. నిర్మాతగా హరగోపాల్ కు ఇదే మొదటి చిత్రం. దాసరి గారు తనకు ఎంత స్టార్ డం ఉన్నా చిన్న ఆర్టిస్టులతో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో తీశారు. అందులో సంగీత ఒకటి. ఇది హిట్ కాకపోయినా దాసరి తర్వాతి సినిమాల్లో కూడా నారాయణమూర్తికి వేషాలిచ్చి ప్రోత్సహించేవారు. అర్థరాత్రి స్వతంత్రంతో స్వీయ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి హిట్టు కొట్టాక చాలా ఏళ్ళకు శిష్యుడితో ఒరేయ్ రిక్షా రూపంలో బ్లాక్ బస్టర్ అందించడం దాసరి గారికి ఓ మధుర జ్ఞాపకం