iDreamPost
android-app
ios-app

స్టార్ మా ఛానల్ సినిమా గేమ్

  • Published Jun 26, 2021 | 5:48 AM Updated Updated Jun 26, 2021 | 5:48 AM
స్టార్ మా ఛానల్ సినిమా గేమ్

ఓటిటిలు వచ్చాక శాటిలైట్ ఛానల్స్ కూడా గట్టి పోటీని ఎదురుకుంటున్నాయి. డైలీ సీరియల్స్, రియాల్టీ షోలు ఎంత ఆదరణ పొందినా సినిమాలకుండే క్రేజ్ వాటి రెస్పాన్స్ ద్వారా వచ్చే కిక్కే వేరు. అందుకే గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా సినిమాల శాటిలైట్ హక్కులు పదుల కోట్లు దాటేసి వందలకు చేరుకుంటున్నాయి. ఇదంతా మార్కెట్ మహత్యమే. మొన్నటిదాకా ఈ విషయంలో జెమిని డామినేషన్ స్పష్టంగా కనిపించేది. స్టార్ మా మాత్రం వెనుకబడినట్టు అనిపించేది. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మోస్ట్ క్రేజీ టాలీవుడ్ సినిమాలన్నీ వరసబెట్టి కొనేసి షాకుల మీద షాకులు ఇస్తోంది.

ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, పుష్ప, అఖండ, ఖిలాడీ, మాస్ట్రో, లవ్ స్టోరీ, టక్ జగదీశ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నీ స్టార్ మా ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఎంత లేదన్నా ఆర్ఆర్ఆర్ ని పక్కనపెట్టి లెక్కిస్తే మిగిలినవన్నీ కలిపి సుమారు రెండు వందల కోట్ల దాకా పెట్టుబడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆచార్య లాంటివి కొన్ని మినహాయించి మరికొన్ని కొనడానికి స్టార్ మా ప్లాన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ మూడు సినిమాల తాలూకు డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. తెలుగు ఛానల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న తరుణంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఎంటర్ టైన్మెంట్ సెక్టార్ కు మరీ ఎక్కువ.

ఒకప్పుడు దూరదర్శన్ లో తమ సినిమాను వేసుకోవాలంటే నిర్మాతలకు అదో పెద్ద ప్రహసనంగా ఉండేది. దానికి దక్కే సొమ్ము కూడా చాలా తక్కువ. కేబుల్ విప్లవం మొదలయ్యాక ఏకంగా పెట్టుబడి మొత్తం ఈ రూపంలోనే వెనక్కు వచ్చే దాకా వెళ్ళింది. మరోవైపు జెమిని సినిమాల మీద కాస్త ఫోకస్ తగ్గించి రియాలిటి షోల మీద దృష్టి పెడుతోంది. ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, తమన్నా లాంటి స్టార్లు వీటిని హోస్ట్ చేస్తుండటంతో రేటింగ్ విషయంలో ఆసక్తి నెలకొంది. మొత్తానికి శాటిలైట్ వార్ మున్ముందు రసవత్తరంగా మారడం ఖాయం.