iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ తో కోదండ రామిరెడ్డి సినిమా ఎందుకు వర్క్ అవుట్ కాలేదు? – Nostalgia

  • Published Feb 04, 2020 | 7:02 AM Updated Updated Feb 04, 2020 | 7:02 AM
ఎన్టీఆర్ తో కోదండ రామిరెడ్డి సినిమా ఎందుకు వర్క్ అవుట్ కాలేదు? – Nostalgia

తెలుగు సినిమా కమర్షియల్ చాప్టర్ లో ఒక ప్రత్యేకమైన పేజీ కలిగిన దర్శకులు ఏ కోదండరామిరెడ్డి. చిరంజీవికి ఖైదీ లాంటి సినిమా ఇవ్వకపోయి ఉంటే చరిత్ర ఇంకోలా ఉండేదేమో. మాస్ పల్స్ ని పసిగట్టడంలో తనదైన శైలిని కలిగిన కోదండరామిరెడ్డి గారు ఎనభై తొంభై దశకాల్లోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. 1980లో డెబ్యు మూవీ సంధ్యతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈయన న్యాయం కావాలి రూపంలో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత కృష్ణతో తీసిన కిరాయి కోటిగాడు కోదండరామిరెడ్డి రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

అది మొదలు ఎన్నో ఏళ్ళ పాటు జైత్ర యాత్ర కొనసాగుతూనే వచ్చింది. బాలకృష్ణతో అనసూయమ్మ గారి అల్లుడు, భానుమతి గారి మొగుడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకులు శోభన్ బాబుకు సైతం శ్రావణ సంధ్య, కార్తీక పౌర్ణమి లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఇచ్చారు. నాగార్జునకు మాస్ ఇమేజ్ రావడంలో అల్లరి అల్లుడు పాత్ర చాలా ఉంది. ఇందరితో ఇన్ని చేసినా కోదండరామిరెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ తో సినిమా చేయలేదన్న కొరత మాత్రం అలాగే ఉండిపోయింది.

ఒకదశలో తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు ఈయన్ని పిలిచి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారట. కానీ అప్పటికే విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న కోదండరామిరెడ్డి ఇచ్చిన రెండు నెలల టైంలో స్క్రిప్ట్ సిద్ధం చేయలేకపోయారు. తమిళ్ లో శివాజీ గణేశన్ నటించిన గౌరవం సినిమా రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ ఇది కుదరదని గుర్తించి నా దేశం, బొబ్బిలిపులిలు పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. కోదండరామిరెడ్డితో పోటీగా కమర్షియల్ మార్కెట్ ని ఏలిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు కానీ ఈయన మాత్రం ఆ ఒక్క విషయంలో గెలవలేకపోయారు. అందుకే ప్రస్తావన వచ్చినప్పుడంతా ఈ లోటు ఫీలవుతారు రెడ్డి గారు.