iDreamPost
iDreamPost
ఇప్పుడంటే ఫంక్షన్లకు ఉత్సవాలకు డీజే సౌండ్ లకు అలవాటు పడిపోయాం కానీ ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ ట్రూపులు రాజ్యమేలేవి. అయిదు నుంచి పది దాకా సభ్యులుండే బృందాలు ఊరూరా తిరిగి దొరికిన చోట స్టేజిలు కట్టుకుని స్టార్ హీరోల సూపర్ హిట్ పాటలకు అవే కాస్ట్యూమ్ లు, మేకప్ వేసుకుని డాన్సులు చేస్తుంటే జనం ఎగబడి చూసేవారు. టికెట్ కొన్న డబ్బులు కాక విడిగా తమకు నచ్చిన పాటలకు వేదిక పైకే చిల్లర విసిరేవారు. ఆ సంస్కృతి ఇప్పుడు లేదు కానీ అప్పటి యువతరానికి మాత్రం ఇవి ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలు. 80 దశకంలో ఈ ట్రెండ్ ఉధృతంగా ఉన్నప్పుడు దీన్నే సబ్జెక్టు తీసుకుని వచ్చిన ఒకే సినిమా శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్.
మహర్షి షూటింగ్ జరుగుతున్న టైంలో దర్శకుడు వంశీకి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల మీద ఒక సినిమా తీయాలనిపించింది. అనుకోవడమే ఆలస్యం తనికెళ్ళ భరణితో పాటు వేమూరి సత్యనారాయణతో కలిసి స్క్రిప్ట్ వండటం మొదలుపెట్టారు. ముందు అనుకున్న హీరో శివాజీరాజా. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. ఏ కారణమో తెలియదు కానీ ఫైనల్ గా నరేష్ ఫిక్స్ అయ్యాడు. మాధురి హీరోయిన్. కోట, రాళ్ళపల్లి, నిర్మలమ్మ, వై విజయ మల్లికార్జునరావు తదితరులు ఇతర తారాగణం. రీమిక్స్ కి అసలు ఒప్పుకోని ఇళయరాజా మొదటిసారి కథ డిమాండ్ చేయడంతో వంశీ అభ్యర్థన మేరకు చేశారు. మళ్ళీ ఎప్పుడు ఆయన అలాంటి ప్రయత్నం చేసిందే లేదు.
కృష్ణ, ఎన్టీఆర్ సూపర్ హిట్స్ సాంగ్స్ కి తన ఇన్స్ట్రుమెంటేషన్ తో కొత్త అందం తీసుకొచ్చారు. ఒకే రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ఉండే ఓ ప్రేమ జంట రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది. ఆ విషయం తెలియని హీరోయిన్ బామ్మ వేరే పెళ్లి ఖాయం చేస్తుంది. అప్పుడు ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి. చిత్రం ఆద్యంతం సన్నివేశాల పరంగా కాకుండా సంభాషణల ద్వారా నవ్వించడమే దీని ప్రత్యేకత. ఆర్టిస్టులు ఒకరిని మించి మరొకరు సహజమైన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టారు. 1988 జూన్ 27న ఈ సినిమా విడుదలైంది. అదే రోజు రిలీజైన పృథ్విరాజ్, భార్యభర్తల బంధం పోటీని తట్టుకుని మరీ మంచి సక్సెస్ అందుకుంది.
Also Read : కళాతపస్వి నృత్యభరిత దృశ్యకావ్యం – Nostalgia