Idream media
Idream media
నాకు పూహ వచ్చేసరికి మా పల్లెలోని ఇంటిగోడకి శ్రీకృష్ణార్జునయుద్ధం పోస్టర్ వుండేది. NTR, ANRలని మొదటిసారి చూసింది ఆ పోస్టర్‌లోనే. ఎనుము దూడలతో ఆడుకుంటూ వాళ్లద్దిరిని అలాగే చూస్తూ వుండేవాన్ని.
ప్రేమనగర్ సినిమాకి పల్లెల నుంచి తాడిపత్రికి బళ్లు కట్టుకుని వెళ్లి చూసారు. స్కూల్లో అందరూ NTR పార్టీనే. ఆయనైతే ఫైటింగ్‌లు చేస్తాడు. ANR స్టెప్పులేసి పాటలు పాడతాడు. నాగేశ్వరరావుకి ఫైటింగ్‌లు రావు. చేసినా ఘోరంగా చేస్తాడు.
బాగా చిన్నప్పుడు ఆత్మీయులు సినిమాకి తీసుకెళ్లారు. మొదట్లోనే హత్య జరుగుతుంది. నేను కెవ్వు కేక. నా అరుపులు భరించలేక ఇంటికి ఎత్తుకొచ్చారు.
ANR పైన కొంచెం ప్రేమ కలగడానికి గుండమ్మ కథ కారణం. మిస్సమ్మలో అయితే ఫుల్ కామెడీ. మా చిన్నాన్నకి నాగేశ్వరరావు ఫ్రెండ్ అని చాలా కాలం నమ్మేవాన్ని. ఎందుకంటే ANR సంతకం ఉన్న ఫొటో వుండేది. మా చిన్నాన్న కూడా గర్వంగా నేను జాబు రాస్తే ANR రిప్లై ఇస్తాడు తెలుసా అనేవాడు. ఆ రోజుల్లో అభిమానులకి రిప్లయ్ ఇవ్వడమే కాదు, ఫొటోలు కూడా పంపడం ANR సంస్కారం.
NTR అర్థం కావడానికి వయసక్కర్లేదు. ANR తెలియాలంటే మనం కొంచెం పెరగాలి. దేవదాసు ఏడుపు సినిమా అనుకుని చిన్నప్పుడు చూడలేదు. ఇపుడు ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తు లేదు. దసరాబుల్లోడు పబ్లిసిటీ రాయదుర్గంలో మామూలుగా జరగలేదు. డప్పులు, పులివేషాలు, బ్యాండ్ మేళాలు వూరంతా కోలాహలం. నూర్‌టూరింగ్ టాకీస్ అనే టెంట్‌లో వేసారు. టెంట్ చిరిగిపోయింది.
రికార్డ్ డాన్స్ అంటే ఆయన పాటలే. చెంగావి రంగు చీర అని ఆ రోజుల్లో పాడని వాళ్లు లేరు. ఆ పాట లేకుండా ఒక్క ప్రోగ్రాం కూడా జరిగేది కాదు. 1978 నాటికి అనంతపురంలో అక్కినేని అభిమాన సంఘం చాలా Active. పావురాల కృష్ణ అనే ఆయన ఓల్డ్ టౌన్‌లో చిన్నసైజు డాన్. ఆయన నాయకత్వంలో ఒక బ్యాచ్ పనిచేసేది. తరువాత ఆయన రాజకీయాల్లో చేరాడు.
NTR అభిమానులకి పోటీగా ANR సినిమాలకి పాలాభిషేకాలు, అన్నదానాలు, కటౌట్లకి గజమాలలు, టికెట్లు సొంతంగా కొని హౌస్‌ఫుల్ చేయించడం , చాలెంజ్‌లు విసురుతూ పాంప్లెట్లు వేయడం ఇది చాలా పెద్ద నెట్‌వర్క్. ఒక ఉన్మాదం. బుచ్చిబాబు అనే సినిమా కదిరిలో నూరు రోజులు ఆడితే, అనంతపురం నుంచి రెండు టూరిస్ట్ బస్సుల్లో అభిమానులు వెళ్లారు.
హీరోగా రిటైరైన తరువాత కూడా ఆయన వేసిన పాత్రలు సామాన్యమైనవి కావు. సీతారామయ్యగారి మనుమరాలులో ఆ క్యారెక్టర్ ఆయనే చేయగలరు. 2001లో ఆయన తిరుపతి వచ్చారు. మయూర హోటల్లో ప్రెస్‌మీట్. చలాకీతనం, సెన్స్ఆఫ్ హ్యూమర్ ముచ్చటేసింది. ఏదో విషయం అడిగితే నాకు తెలియదు అని వినమ్రంగా చెప్పారు. ఇగో లేని లెజెండ్.
తనకి క్యాన్సర్ అని ప్రకటించినపుడు కూడా ఆ కళ్లలో అదే ధైర్యం. మృత్యువు అంటే భయం లేనితనం. ఒక దశలో పార్టీ పెడతాడనే అనుకున్నారు. కానీ ఎందుకో జరగలేదు. అదే మంచిది. ఆయన నటుడే. కానీ రాజకీయాల్లో నటించే అంతకాదు.
వారసుల్లో ఆయనంత ఎవరూ లేరు. నాగార్జున ఎలాగో లాగేసాడు. మిగిలిన వాళ్లంతా మన మీద రుద్దినవాళ్లే. ANRకి ఆకలి తెలుసు, కన్నీళ్లు తెలుసు. వీళ్లకి తెలియదు. పారడైజ్ చికెన్ బిరియాని తిన్నవాడు ఆకలి Expression ఏమిస్తాడు? ఆయనకి చీకటి తెలుసు, వీళ్లకి లైటింగ్ మాత్రమే తెలుసు. కళ గొప్పతనం ఏమంటే అది ఆస్తి కాదు. పత్రాలపై సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేతులు మారదు.
అక్కినేని అనే ఇంటి పేరు నిలబెట్టే సత్తా ఎవరికైనా వుందంటే అది సమంతాకే. నిజానికి ఆమెకి ఇంటి పేరు అవసరం లేదు.
Also Read : నేడే 50వ రోజు – కిక్కు కోరుతున్న టాలీవుడ్