iDreamPost
iDreamPost
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఎయిర్ ఫోర్స్ 1 ప్రత్యేక విమానం ఉన్నట్లే మన ప్రధానమంత్రికి కూడా అధునాతన, ప్రత్యేక విమానం రెడీ అయిపోయింది. దాని సేవలు వచ్చే ఆగష్టు నుండి అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడి బోయింగ్ 747 విమానం వాడుతున్నారు. దీని స్ధానంలో 777 అందుబాటులోకి రాబోతోంది. అధునాతన విమానాలు ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే కాదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కూడా ప్రత్యేకంగా రాబోతున్నాయి. అంటే కేంద్రం మొత్తం మీద మూడు విమానాలను తెప్పిస్తున్నది. ఆగష్టులో రాబోయే మొదటి విమానాన్ని ప్రధానమంత్రికి కేటాయించారు.
ఇపుడున్న బోయింగ్ 747లో నాలుగు ఇంజన్లుంటే కొత్త విమానంలో 2 ఇంజన్లే ఉంటాయి. ప్రస్తుత విమానంలోని నాలుగు ఇంజన్లలో మూడు పాడైనా ఒక్కదానితో మ్యానేజ్ చేయవచ్చు. కానీ రాబోయే విమానంలో ఒకటి పాడైనా ఇబ్బందులు తప్పవట. ప్రస్తుత విమానంలో ఏకబిగిన 12 గంటలు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉంది. కొత్త విమానంలో 18 గంటలు ప్రయాణం చేయచ్చు.
ప్రస్తుతం వాడుతున్న విమానంలో ఇందనం నింపుకోవాలంటే కిందకు దిగాల్సిందే. అయితే కొత్తగా రాబోతున్న విమానంలో గాలిలోనే ఇందనం నింపుకోవచ్చు. ఇప్పటి విమానంలో అమెరికా దాకా ప్రయాణించాలంటే మధ్యలో ఇందనం కోసం ఎక్కడో ఓ చోట దింపాల్సిందే. రాబోయే విమానంలో ఇండియాలో ఇందనం నింపుకుని బయలుదేరితే అమెరికా వెళ్ళేదాకా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటి విమానంలో క్షిపణి దుర్భేధ్య, అధునాత రాడార్ లాంటి రక్షణ వ్యవస్ధలు లేవు. అయితే రాబోయే విమానంలో పటిష్ట భద్రతా వ్యవస్ధ ఉంది.
ఇపుడున్న విమానంలో కానీ రాబోయే విమానంలో కూడా విశాలమైన సమావేశ మందిరం, కమ్యూనికేషన్, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటుంది. మొత్తానికి పై ముగ్గురికి ప్రత్యేక విమానాలుండాలనే దశాబ్దాల డిమాండ్ తొందరలో సాకారం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం రూ. 8458 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ విమానాల్లోని మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటుకే రూ. 1435 కోట్లు ఖర్చవుతోంది. కొత్తగా రాబోయే విమానాలకు ముందు వైపున పై భాగాన శక్తివంతమైన ఇడబ్ల్యూ జామర్ ఉంటుంది. తోక భాగంలో క్షిపణి హెచ్చరిక వ్యవస్ధ, డైరెక్షనల్ ఇన్ ఫ్రారెడ్ కౌంటర్ మెజర్ సిస్టమ్ 24 గంటలూ పనిచేస్తుంటుంది. ఆగష్టులో మొదటి విమానం రాబోతుంటే రెండో విమానం సెప్టెంబర్ కు అందుబాటులోకి రాబోతోంది. మొత్తం మీద ప్రధానికి ప్రత్యేక విమానం ఉందంటే దేశానికి గర్వకారణమే కదా.