iDreamPost
android-app
ios-app

స్పెయిన్‌ యువరాణిని బలితీసుకున్న కరోనా

స్పెయిన్‌ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 30 వేల మందిని బలితీసుకుంది. «ఆస్తి అంతస్తులతో తేడా లేకుండా అందరిని తన కౌగిట బంధిస్తానని కరోనా వైరస్‌ రుజువుచేస్తోంది. తాజాగా స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా థెరిసా(86) కరోనా వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. యువరాణి మరణించినట్లు ఆమె సోదరుడు ప్రిన్స్‌ ఎన్నిక్‌ డి బోర్సన్‌ తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలియజేశారు. వైరస్‌ సోకినట్లు తెలిసిన తర్వాత యువరాణి చికిత్స తీసుకోవడం ప్రారంభించారని, పరిస్థితి విషమించడంతో ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిందని వెల్లడించారు. మరియా «థెరిసా 1933లో పారిస్‌లో జన్మించారు. నిన్న శుక్రవారం మాడ్రిడ్‌లో యువరాణి అంత్యక్రియలు జరిగిన విషయం వెళ్లడించారు.

కరోనా వైరస్‌ రాజ కుటుంబాలను, ప్రముఖలకు సోకింది. బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా బారిన పడ్డారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఆ దేశ వైద్య శాఖ కార్యదర్శి, హాలివుడ్‌ నటులు, ఇతర ప్రముఖులకు కరోనా సోకింది. వీరందరూ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకూ ప్రపంచంలోని 183 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనా తర్వాత యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్‌ దేశాలు ఈ మహమ్మరి ధాటికి విలవిలలాడుతున్నాయి. ఇటలీలో ఇప్పటి వరకూ పది వేల మంది చనిపోయారు. ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్‌ దేశాల కన్నా అగ్రరాజ్యం అమెరికా కరోనా వల్ల తీవ్రంగా బాధింపబడుతోంది. అమెరికాలో పాజిటివ్‌ కేసులు ఇతర దేశాల కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.