iDreamPost
iDreamPost
వేశ్యా వాటికలను ఆధారంగా చేసుకుని వచ్చే సినిమాలు చాలా తక్కువ. వీటికి కమర్షియల్ వేల్యూ పెద్దగా ఉండదు కాబట్టి చాలా అరుదుగా దర్శకులు ఈ కథలను ఎంపిక చేసుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినవే. కరీనా కపూర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చమేలీ చేస్తే ప్రశంసలు దక్కాయి కానీ వసూళ్లు తక్కువే. తెలుగులో కమలతో నా ప్రయాణం లాంటి విభిన్న చిత్రాలు వచ్చాయి కానీ ప్రేక్షకులను అవి మెప్పించలేకపోయాయి. శ్రేయ సైతం పవిత్ర అనే మూవీ చేయడం గుర్తే. కానీ దాని ఫలితం కూడా నిరాశపరిచే విధంగా వచ్చింది. వేదంలో అనుష్క ఎంత గొప్పగా నటించినా అది బ్లాక్ బస్టర్ కాలేకపోయింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ ఇండియన్ సినిమాలో ఓ ప్రత్యేక ముద్ర వేసిన సినిమాగా 1983లో వచ్చిన మండీని చెప్పుకోవచ్చు. శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ లాంటి ఎందరో విలక్షణ తారాగణం అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మండీకి అరుదైన గౌరవం దక్కింది. 12 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకోవడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. న్యూ జెనరేషన్ ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సిన అంశాలు మండీలో చాలా ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం వచ్చిన మాస్టర్ పీస్ ఇది
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరో మండిని రూపొందించబోతున్నారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. కాకపోతే సినిమా కాదు వెబ్ సిరీస్ రూపంలో. ఇందులో ప్రధాన పాత్రకు దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హాను ఎంపిక చేసుకున్నట్టు ముంబై టాక్. హీరా మండి అనే టైటిల్ ని లాక్ చేశారట. పాకిస్థాన్ లాహోర్ లో ఉన్న అత్యంత చరిత్ర ఉన్న వేశ్యలు ఉండే వీధి అది. అక్కడ జరిగే కథను ఇందులో చూపిస్తారట. సోనాక్షితో పాటు హ్యూమా ఖురేషిని కూడా తీసుకున్నట్టు తెలిసింది. మొత్తానికి మండి టైటిల్ తో ఇంతకాలం తర్వాత ఓ విలక్షణ దర్శకుడు ఓ సిరీస్ చేయడం విశేషమే. ఇందులో కథక్ డాన్సుకు చాలా ప్రాధాన్యం ఉంటుందట