iDreamPost
android-app
ios-app

బీజేపీ కమిటీలో సోము వీర్రాజు మార్క్, బాబు వర్గంలో అసంతృప్తి

  • Published Sep 14, 2020 | 2:32 AM Updated Updated Sep 14, 2020 | 2:32 AM
బీజేపీ కమిటీలో సోము వీర్రాజు మార్క్, బాబు వర్గంలో అసంతృప్తి

ఏపీ బీజేపీ నూతన కమిటీ ప్రకటించారు. సోము వీర్రాజు తనదైన శైలిలో ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని ఏపీ బీజేపీకి జంబో కార్యవర్గం ఉండేది. కానీ ఇప్పుడు సోము వీర్రాజు దానిని బాగా కుదించారు. కేవలం 40మందికే పరిమితం చేశారు. గతంలో అది 70 మంది వరకూ ఉండేవారు. ముఖ్యంగా అధికార ప్రతినిధుల సంఖ్యను బాగా కుదించారు. గతంలో వారి సంఖ్య 21గా ఉండేది. కానీ ప్రస్తుతం ఆసంఖ్యను కేవలం ఏడుకి పరిమితం చేశారు. దాంతో పలువురు ఆశావాహులకు ఆశాభంగం తప్పలేదు. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న చంద్రబాబు స్నేహితులకు చోటు దక్కలేదు. దాంతో ఇప్పటికే సోము వీర్రాజు అనగానే చిటపటలాడే ఆ వర్గపు నేతలు ఇప్పుడు మరింత రగిలిపోతున్నారు.

లంకా దినకర్, సాధినేని యామినీ, వరదాపురం సూరి సహా అనేక మంది నేతలు తమకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు పండలేదు. ఆయా పదవులకు కోసం వారు లాబీయింగ్ చేసినట్టు కూడా ప్రచారం సాగింది. ముఖ్యంగా అధికార ప్రతినిధులమని చెప్పుకునేందుకు తపన పడిన నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. అధికార ప్రతినిధుల హోదాలో టీవీ చర్చల్లో చంద్రబాబుకి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకన్న కొందరు నేతలకు ఈ పదవులు దక్కకపోవడం మింగుడుపడడం లేదనే చెప్పవచ్చు.

అదే సమయంలో కార్యవర్గంలో పూర్తిగా తన అనుచరులకే సోము వీర్రాజు పెద్ద పీట వేశారు. ప్రధాన కార్యదర్శులకు సాటి ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు విష్ణువర్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి చోటు కల్పించారు. కానీ అదే సమయంలో తన ప్రధాన అనుచరులు రేలంగి శ్రీదేవి, వేటుకూరు సూర్యనారాయణరాజులకు కూడా కీలక పదవులు కట్టబెట్టారు. ఇక కన్నా, పురందేశ్వరి వంటి వర్గాలకు కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే పెద్ద పీట వేశారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తగిన అవకాశాలు రాలేదు. ఇది చంద్రబాబు పాత స్నేహితులకు రుచించడం లేదు.

ఒకనొక సందర్భంలో తానే కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిననే రీతిలో ప్రచారం చేసుకున్న సుజనా చౌదరికి పూర్తి అసంతృప్తి కలిగించినట్టు కనిపిస్తోంది. సీఎం రమేష్ సిఫార్స్ చేసిన వారికి కూడా చోటివ్వకపోవడంతో ఆ వర్గపు నేతంతా గుర్రుగా ఉన్నారు. పదాదికారుల ఎంపికలోనూ తన మార్క్ రాజకీయాలతో సోము వీర్రాజు రాష్ట్ర కార్యవర్గం విషయంలో పూర్తి పట్టుని సాధించినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ అధిష్టానం వీర్రాజుకి ఇచ్చిన స్వేచ్ఛ ఆధారంగా ఎంపిక చేయడంతో ఏపీ బీజేపీలో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయనే చెప్పవచ్చు. సామాజికంగా చూస్తే కమ్మ వర్గానికి చెందిన వారికి 10 మందికి పైగా చోటివ్వడం కొసమెరుపు.