Idream media
Idream media
పాము పగబడుతుందని ఎవరు కనుక్కున్నాడో కానీ, సినిమాల్లో ఈ ఫార్ములా సూపర్‌హిట్. చిన్నప్పుడు బళ్లారి రాయల్ టాకీస్‌లో “నోము” సినిమా చూశాను (ఈ టాకీస్ ఇప్పటికీ ఉంది. కాకపోతే మూతపడింది). ఆ సినిమాలో హీరోయిన్ చంద్రకళ. నాగుపాము భక్తురాలు. ఆమెకి కష్టాలు కలగకుండా కాపాడుతూ ఉంటుంది. శరత్‌బాబు విలన్, జయసుధ వాంప్. చంద్రకళ కన్నీళ్లు పెడుతూ ఒక పాట పాడితే చాలు సీన్‌లోకి పాము ఎంటర్ అవుతుంది. థియేటర్ అంతా బూర శబ్దం. జనంలో ఉత్సాహం.
ఈ సినిమా హాంగోవర్ చాలా కాలం ఉండింది. పుట్ట కనిపిస్తే చాలు నాగరాజా కాపాడు అని దండం పెట్టేవాన్ని. నా బదులు పాము వచ్చి పరీక్ష రాస్తుందని ఎదురు చూసేవాన్ని. నాగులచవితి రోజు పుట్టలో పాలు పోసి, పాము ఆశీర్వాదం కోసం భక్తిగా చూసేవాన్ని.
పాము ఒక్కరోజు కూడా కనపడింది లేదు. పరీక్షా సమయాల్లో కాపాడింది కూడా లేదు. టెన్త్ చదువుతున్నప్పుడు అనంతపురం శాంతి టాకీస్‌లో “నాగిన్” అనే హిందీ సినిమా చూశాను. మగపాముని చంపిన వాళ్లని ఆడపాము వెంటాడి చంపుతుంది. ఆమె రీనారాయ్‌లాంటి అందగత్తెగా మారి పగ తీర్చుకుంటుంది. పాములు పగ తీర్చుకుంటాయని నాకు చిన్నప్పుడే తెలుసు. ఎందుకంటే స్కూల్‌లో, ట్యూషన్లలో పాము పగ కథలు ఎన్నో చెప్పుకున్నాం కాబట్టి. కాకపోతే పాము రూపంలో ఉన్న అందగత్తె , లేదా అందగత్తె రూపంలో ఉన్న పాముని ఎలా గుర్తు పట్టడం?
నాగిన్ పేరుతో పాత హిందీ సినిమా కూడా ఉంది. ఆ సినిమా ఆడుతున్న థియేటర్లలోకి పాములు వచ్చేవని చెప్పుకునేవాళ్లు. ఈ పుకారు సినిమా నిర్మాతలే పుట్టించి ఉంటారు.
తర్వాత చిరంజీవి పున్నమి నాగు చూశాను. దీంట్లో మగవాళ్లు కూడా పాములుగా మారుతారని అర్థమైంది. కీర్తి సురేష్ తల్లి మేనక హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో హిట్.
సినిమాల్లో పాముని రకరకాలుగా వాడేవాళ్లు. హీరోయిన్ పాముని చూసి భయపడుతుంటే హీరో వచ్చి కాపాడేవాడు. హీరోయిన్‌ని రేప్ చేసే మూడ్‌లో విలన్ వస్తున్నప్పుడు, పాము వచ్చి కాటేసేది.
పౌరాణిక సినిమాల్లో శివుడి మెడలో ఉండేది. కొన్నిసార్లు బొమ్మ పాము వాడేవాళ్లు. కొన్నిసార్లు నిజం పాము ఉండేది. అది అటుఇటూ కదులుతూ ఉంటే యాక్ట్ చేయడం కష్టమే. షూటింగ్‌ల్లో ఆ మూగ జీవుల్ని దారుణంగా హింసించేవాళ్లు. నోరుని కుట్టేవాళ్లు. ఒక్కోసారి చచ్చిపోయేవి కూడా.
ఇప్పుడు చట్టాలు కఠినంగా ఉండటంతో సినిమాల్లో పాము కనిపించడం తగ్గిపోయింది.
పురాణాల్లో నాగలోకం ఉందని రాశారు. అక్కడంతా పాములే. నాగిని డ్యాన్స్ కూడా చాలా ఫేమస్. ఖైదీలోని “రగులుతోంది మొగలి పొద” పాట ఆల్ టైమ్ హిట్.
చిన్నప్పుడు పాములంటే భయం ఉండేది. పెరిగేకొద్ది పాముకి మించిన విషపూరితమైన మనుషుల్ని చూసిన తర్వాత భయం పోయింది.