iDreamPost
android-app
ios-app

థియేటర్ కన్నా ముందే నెట్టింట్లోకి

  • Published Mar 31, 2020 | 11:01 AM Updated Updated Mar 31, 2020 | 11:01 AM
థియేటర్ కన్నా ముందే నెట్టింట్లోకి

కరోనా లేదా కోవిడ్ 19 పేరేదైనా దీని ప్రభావం అన్ని రంగాల మీద రకరకాలుగా ఉంది. ముఖ్యంగా వినోద పరిశ్రమకు తగిలిన షాక్ నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తం సద్దుమణిగాక రిలీజ్ డేట్ల కోసం నిర్మాతలు చిన్న పాటి యుద్ధాలే చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక విషయానికి వస్తే ఇప్పుడీ వైరస్ దెబ్బకు ఓ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టకుండానే ఏకంగా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

శివ కార్తికేయన్ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా హీరోని తెలుగులో శక్తి పేరుతో డబ్బింగ్ చేశారు. మార్చ్ 20 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కాని లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. పరిస్థితి ఎప్పుడు నార్మల్ అవుతుందో అర్థం కాని అయోమయం నెలకొంది. మరోవైపు క్రేజీ టాలీవుడ్ మూవీస్ వాయిదా పడి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో శక్తిని నేరుగా రిలీజ్ చేయడం కష్టమని గుర్తించిన నిర్మాతలు నేరుగా ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకు అందించారు. ఇవాళ నుంచి ఇది అందుబాటులోకి వస్తోంది .

విద్యా వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని భారతదేశాన్ని శాశించాలని ప్రయత్నించే ఒక సంఘ విద్రోహ శక్తిని ఓ మాములు వ్యక్తి ఎదురుకునే కథాంశంతో మిత్రన్ దీన్ని రూపొందించారు. విలన్ గా అభయ్ డియోల్ నటించగా హీరోని గైడ్ చేసే చాలా కీలకమైన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. అఖిల్ హలోతో పరిచయమై సాయి ధరం తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో కనిపించిన కళ్యాణి ప్రియదర్శిని ఇందులో హీరొయిన్.

కమర్షియల్ సినిమాకు కావలసిన అంశాలన్నీ పొందుపరుచుకుని మంచి యాక్షన్ డ్రామాగా రూపొందిన శక్తి తమిళ్ లో మంచి విజయం నమోదు చేసుకుంది. విశాల్ అభిమన్యుడుతో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించిన మిత్రన్ ఇందులో కూడా కూడా తనదైన టేకింగ్ తో మెప్పించాడు. మరి పైసా ఖర్చు లేకుండా తమిళ్ హిట్ మూవీని తెలుగు లో చూసే అవకాశం కలిగించింది ముమ్మాటికి వైరసే. ఈ మహమ్మారి త్వరగా వైదొలగిపోతే నేరుగా థియేటర్లలో కొత్త సినిమాలు చూసుకోవచ్చు. అప్పటిదాకా ఈ తిప్పలు తప్పవు.