iDreamPost
android-app
ios-app

సెక్రటేరియట్ వద్ద సీతక్కకు చేదు అనుభవం..!

సెక్రటేరియట్ వద్ద సీతక్కకు చేదు అనుభవం..!

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి తర్వాత.. అంతే క్రేజ్ ఉన్న నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధనసరి అనసూయ. ప్రజల్లో నిత్యం తిరుగుతూ.. సమస్యలు వింటూ.. వాటిని తీర్చేందుకు అధికార పక్షం బీఆర్ఎస్‌తో ఫైట్ చేస్తుంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఎన్నికైన ఇద్దరు మహిళా నేతల్లో ఆమె ఒకరు(మరొకరు సబితా ఇంద్రారెడ్డి.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు) . ఎమ్మెల్యే అయిన నాటి నుండి ప్రజలతోనే మమేకమై ఉన్నారు. చాలా నిరాడంబరంగా ఆమె జీవన శైలి ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఆమెను అభిమానిస్తుంటారు. కరోనా వంటి కష్టకాలంలో.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఆమె స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు అందించారు.

అలాంటి మహిళా నేతకు తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారులో సెక్రటేరియట్ వద్దకు రాగానే.. పోలీసులు గేటు వద్ద ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని.. సెక్రటేరియలోకి పంపాలంటూ పోలీసులకు తెలిపారు. పోలీసులు వినిపించుకోకపోయే సరికి తీవ్ర అసహనానికి గురైన సీతక్క.. పోలీసుల వద్దకు వెళ్లి ప్రశ్నించారు. అయినప్పటికీ అనుమతించకపోవడంతో.. తన వాహనాన్ని సెక్రటేరియట్ ప్రధాన గేటు దగ్గరే ఆపేసి నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ వాహనానికే అనుమతి ఇవ్వలేదా, లేక ఇతర కారణాలతో ఆమెను లోపలికి పంపించేందుకు ఆలోచించారా అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.