iDreamPost
android-app
ios-app

సిరా…తప్పక చదవవలసిన నవల

సిరా…తప్పక చదవవలసిన నవల

సిరా సిరా సిరా.. గత రెండు మూడ్రోజులుగా నన్ను ఎక్కువగా ఇబ్బందిపెడ్తూ నా ఆలోచనల్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రచన..

బుక్ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లిన నాకు అక్కడున్న యండమూరి, క్రిష్ణవంశీ, హీరో రాజశేఖర్ లాంటోల్లని చూసి వాళ్లంతా వచ్చి ఆవిష్కరించేంత ఏముందబ్బా ఈ నవలలో అనుకున్నా. ఈ పుస్తకం గురించి ఒక్కొక్కరూ చెబ్తుంటే అన్నీ ఫంక్షన్లలో చెప్పినట్టే దీంట్లో కూడా చెబుతుంటారులే అనుకున్నా. అందరూ మాట్లాడిన తర్వాత చివర్లో రచయిత మాట్లాడుతూ పొడి పొడిగా నాలుగు మాట్లాడితే ఇతనేంటిలా పుస్తకం గురించి ఏమీ చెప్పలేదే అనుకున్నా. వచ్చేటపుడు అక్కడ స్టాల్లో ఉన్న పుస్తకం కాపీ కొని ఇంటికొచ్చా.

నవల చదవడం మొదలుపెట్టాక గానీ తెలియలేదు ఆయన తీసుకున్న పాయింటు, దాన్ని సమస్యాత్మకంగా గుర్తించిన తీరు, దానికి పరిష్కారం చూపిన తీరు అన్నీ ప్రతొక్కటీ చదివే వాడికి సూదుల్లా గుచ్చుకుని వేధిస్తాయి. రాజ్ మదిరాజు గారి గురించి అప్పుడనిపించింది కంటెంట్ ఉన్నోడికి స్వంత ఎలివేషన్ అక్కర్లేదని. రచయిత ఒక సమస్యని తొవ్వుకుంటూ ఎంత లోతుకెళ్ళగలిగితే ఇంత అద్భుతంగా ఆవిష్కరించగలడు అనిపించింది. సమస్య మూలాలకెళ్లడమే గాదు తన పరిధి మేరకు తను సూచించగలిగిన పరిష్కారమార్గం కూడా పాఠకుడికి అర్థమవుతుంది.

క్లుప్తంగా చెప్పాలంటే ఆయన తీసుకున్న పాయింటు క్వాలిటీ పేరుతో పిల్లల భవిష్యత్ బాగుండాలనే తల్లిదండ్రుల బలహీనతను పట్టుకుని సామాజిక సేవగా చెయ్యాల్సిన విద్యాదానాన్ని ఒక బిజినెస్ సోర్స్ గా చూస్తూ విపరీత ధనార్జనే ధ్యేయంగా సాగే బలవంత నిర్భంధ కళాశాల విద్యను నేర్పించే సారీ రుద్దే సమకాలీన కార్పొరేట్ విద్యా మాఫియాను పాఠకుడి ముందు బట్టలూడదీసి నిలబెట్టాడు. ఆ కార్పొరేట్ మాఫియాతో పాటు కలిసిన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, రాజకీయ శక్తులు ఏ విధంగా భావి భారత పౌరుల బంగారు కలలను తుంచేస్తున్నాయో విశ్లేషణాత్మకంగా చర్చించాడు.

ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు చర్చించాక, అవి మనకు అవగతమయ్యాక సమాజం ఇంత ఊబిలోకి బలవంతంగా నెట్టబడుతున్నామా అని అనిపిస్తుంది. అందులో కార్పొరేట్ శక్తులది ఎంత పాత్ర ఉందో పిల్లల భవిష్యత్తుపై విపరీతమైన ప్రేమతో వారి పసి మనసుల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రలది కూడా అంత కంటే ఎక్కువ పాత్ర ఉంది. తల్లిదండ్రులకు నచ్చచెప్పలేక కార్పొరేట్ శక్తులకు లొంగలేక మానసిక సంఘర్షణతో దిక్కు తోచని అయోమయంలో అర్థంతరంగా తనవు చాలించే పసిమొగ్గలెన్నో ఎన్నెన్నో..

సగంలోకొచ్చాక మనకే అర్థమవుతుంది ఇది నవల కాబట్టి ముగింపు ఉండాలి కాబట్టి ఒక పరిష్కారం దొరికింది గానీ నిజ జీవితంలో ఒక పరిష్కారమంటూ దొరికే సమస్యేనా ఇదని. తమ పిల్లల బంగారు భవిష్యత్ కోరుకునే ఏ తల్లిదండ్రులైనా ఖచ్చితంగా చదివి వారి చదువు పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన నవల ఈ సిరా.