Simhasanam : కృష్ణ సాహసానికి నిదర్శనం ‘సింహాసనం’ – Nostalgia

ఇప్పుడంటే బాహుబలి చూసి ఔరా జానపద గాథలు ఇలా ఉంటాయాని ఆశ్చర్యపోతున్నాం కానీ అసలు టెక్నాలజీ అంతగా లేని రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి సాహసం చేశారనే మాట ఇప్పటి జెనరేషన్ కు షాక్ కలిగించవచ్చు. ఆ విశేషాలు చూద్దాం. 1985 సంవత్సరం. ఎన్టీఆర్ అప్పటికే రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. ఏఎన్ఆర్ ప్రభ తగ్గింది. ఖైదీ ఇండస్ట్రీ హిట్తో చిరంజీవి రోజురోజుకి దూసుకుపోతున్నాడు. కృష్ణ శోభన్ బాబు లాంటి సీనియర్లకు ఒకరకంగా టఫ్ టైం అని చెప్పొచ్చు. పద్మాలయ స్టూడియోస్ నిర్మాణం జరిగాక వేగంగా చిత్రాలు తీయాలని సూపర్ స్టార్ డిసైడ్ అయ్యారు. అప్పుడు వచ్చిన ఆలోచనే సింహాసనం. తన మదిలో తట్టిన ఓ ఐడియాను రచయిత త్రిపురనేని మహారథికి చెప్పారు. ఆయన సహకారంతో ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు.

70ఎంఎంలో స్వీయ దర్శకత్వంలో తీద్దామని కృష్ణ ఫిక్స్ అయినప్పుడు ఇండస్ట్రీ జనాలు షాక్. సంగీతం కోసం బాలీవుడ్ నుంచి బప్పీలహరిని ఒప్పించారని విని ఎవరికి నోట మాట రాలేదు. ఇందులో ఎస్పి బాలసుబ్రమణ్యం పాడరని తెలిశాక ఇంకాస్త అనుమానం. అయినా కృష్ణ వీటిని లెక్క చేసే రకం కాదు. హీరోయిన్లుగా జయప్రద, రాధలతో పాటు హిందీ సెన్సేషన్ మందాకినిని తీసుకున్నారు. షోలే ఫేమ్ అంజాద్ ఖాన్ ఇందులో పాత్ర చేయడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం అందించగా ఈ విభాగంలో స్పెషల్ ఎఫెక్ట్స్ ని రవికాంత్ నాగాయత్ చూసుకున్నారు. సుమారు నాలుగు కోట్ల బడ్జెట్ తో సింహాసనం రూపొందింది. స్టూడియోలో వేసిన ఒక్క సెట్ కే 50 లక్షలు అయ్యింది. సెట్లు చూసేందుకే పరిశ్రమ పెద్దలు స్పాట్ కు వచ్చేవారు.

బిజినెస్ హాట్ కేక్ లా జరిగిపోయింది. కేవలం ఈ సినిమా స్క్రీనింగ్ కోసమే అత్యాధునిక వసతులు సమకూర్చుకున్న థియేటర్లు ఉన్నాయి. 1986 మార్చి 21న భారీగా విడుదలైన సింహాసనం ఘనవిజయం సాధించింది. తెరమీద కృష్ణ డ్యూయల్ రోల్, ఊహించని కథా కథనాలు, వెర్రెక్కించే పాటలు చూసి జనం మళ్ళీ మళ్ళీ ఎగబడి చూశారు. ఫలితంగా 41 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం అప్పట్లో ఒక రికార్డు. పబ్లిసిటీ ఖర్చుతో రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు తీయొచ్చనే రేంజ్ లో ప్రమోషన్ చేశారు. హిందీలో జితేంద్ర హీరోగా ఏకకాలంలో రెండు భాషల్లో కేవలం డెబ్బై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఎన్టీఆర్ తర్వాత ఒక్క కృష్ణకు మాత్రమే సాధ్యమయ్యిందని మీడియా పొగిడింది. అందుకే సింహాసనం ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ వన్నె కోల్పోలేదు.

Also Read : Ooyala : కవల పిల్లల సెంటిమెంట్ డ్రామా – Nostalgia

Show comments