iDreamPost
android-app
ios-app

దుబ్బాక : ష్.. సైలెన్స్..!

దుబ్బాక : ష్..  సైలెన్స్..!

వాడివేడి ఆరోప‌ణ‌లు.. వాదోప‌వాదాలు.., త‌నిఖీలు.. సోదాలు.., ధ‌ర్నాలు.. అరెస్టులు.. పోలింగ్ ముందు రోజు రాత్రి వ‌ర‌కూ ఉప ఎన్నిక జ‌రుగుతున్న దుబ్బాక ప‌రిస్థితి. అభ్య‌ర్థులు, పార్టీల తీరు ఎలాగున్నా ఓట‌ర్లు మాత్రం సైలెంట్ గా మీట నొక్కారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే సైలెంట్ ఓటింగ్ జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలోని 315 పోలింగ్ కేంద్రాల‌లోనూ ఇదే ధోర‌ణి క‌నిపించింది. ఎక్క‌డా పెద్ద‌గా అల్ల‌ర్లు, ఆందోళ‌న‌లు లేకుండా పోలింగ్ దాదాపు సాఫీగా సాగింది. చేగుంటలో మాత్రం దొంగ ఓటు క‌ల‌క‌లం రేపింది. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లిన‌ట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే ఈ ప్ర‌క్రియ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇవ్వ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. తొగుట మండలం వెంకట్రావుపేటతో పాటు కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేశారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్, మ‌రికొన్ని చోట్ల బీజేపీ, అక్క‌డ‌క్క‌డా కాంగ్రెస్ ఆధిక్యం కొన‌సాగిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా ఓట‌ర్లు అంద‌రూ త‌మ‌వైపు నిల‌బ‌డ్డార‌న్న పూర్తి స్థాయి ధీమా ఏ పార్టీ అభ్య‌ర్థికీ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక‌టి ఒక పార్టీకి… ఇంకో సంస్థ మ‌రో పార్టీకి ప‌ట్టం క‌ట్టాయి.

ఓట‌ర్లు అద‌ర‌గొట్టారు…

అస‌లే క‌రోనా కాలం. గ్రామం, ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా.. ఇప్ప‌టికీ అన్ని చోట్లా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కొంత మంది లెక్క‌లేనట్టు తిరుగుతున్నా.. చాలా మందిలో క‌రోనా భ‌యం కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో మొద‌లైన ఉప ఎన్నిక పోలింగ్‌పై కరోనా ప్రభావం ఉంటుంద‌ని కొంత మంది భావించారు. అయితే ఉప ఎన్నిక కాబ‌ట్టి ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని మ‌రికొంద‌రు ఊహించారు. ఎవ‌రి అంచ‌నాలు, ఊహ‌లు ఎలాగున్నా ఓట‌ర్లు మాత్రం అద‌ర‌గొట్టారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద సంద‌డి కొన‌సాగింది. మొత్తం మ్మీద కొవిడ్ కాలంలోనూ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 81.14 శాతం పోలింగ్‌ నమోదైంది. గ‌డువు లోపు వ‌చ్చిన వారంద‌రికీ ఓటు వేసే అవ‌కాశం ఉంటుంద‌ని కాబ‌ట్టి మొత్తం పూర్త‌య్యేస‌రికి 85 శాతం వ‌ర‌కూ చేరే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చివరి గంటలో క‌రోనా బాధితుల‌కు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో 86 శాతం పోలింగ్ నమోదైంది.

ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో ఉన్న మెజార్టీ రాకున్నా మంచి మెజార్టీతో విజ‌యం సాధిస్తామ‌ని టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుజాత‌, ఓట‌ర్లు మార్పు కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంద‌ని విజ‌యం త‌న‌దేన‌ని బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్, తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్దికి తోడు, శ‌క్తివంచ‌న లేకుండా చేసిన ప్ర‌చారం, అగ్ర‌నేత‌ల స‌హ‌కారంతో తానే గెలుస్తాన‌ని శ్రీ‌నివాస్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..

థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరీ మోగిస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం. 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభించనున్నట్లు పేర్కొంది. ఇక పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లు స్పష్టం చేసింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ నెల 10న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపుతో అస‌లు ఫ‌లితం వెల్ల‌డికానుంది.